3411* వ రోజు ....

 గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ!

చోటు మారింది, శ్రమ తరహా మారలేదు - @3411*

         గురువారం (13-3-25) నాటి వీధి శ్రమ పాగోలు పరిధిలోని బ్రహ్మం గారి గుడి, అపార్ట్మెంట్ల ప్రాంతంలో వేకువ 4.20 కి 11 గా ఉన్న కార్యకర్తలు కొద్ది నిముషాల్లో 40 కి పెరిగారు. కారణమేదైతేనేం గాని ఫిబ్రవరి – మార్చి నెలల్లో వెంకటాపురం బాట గ్రామాల్లో గాని, ఇప్పుడీ పాగోలు బాటలోగాని - స్థానికుల ప్రమేయం పెరిగింది!

         తమ తమ నివాస ప్రాంతాల్లో జరిగే పనుల్లో చురుకుగా కల్పించుకొంటున్నారు.  నరసరావు పేట నుండి ఈదర గోపీచందూ, బాలాజీ అపార్ట్మెంట్ల నుండి కందిమళ్ళ వేంకటేశ్వరరావు – ‘చందమామ’ నుండి ఆరేడుగురూ వచ్చి, వీధి కాలుష్యాల మీద యుద్ధంలో పాల్గొన్నారు.

         ముందుగా బ్రహ్మం గుడి, వంతెనల్ని శుభ్రపరిచాక వాలంటీర్ల చూపు అస్తవ్యస్తంగా పెరిగిపోయిన పెద్ద చెట్ల, చిన్న పిచ్చి మొక్కల పైన పడింది. గంటన్నర దెబ్బలాటతో ఆ వరసలోని 10 చెట్ల కొమ్మలూ, బండ్రేవుకోడు కాల్వ పడమటి గట్టు మీది తీగల పొదలూ తెగిపడి ట్రాక్టరులో నిక్షిప్తమయ్యాయి.

         అదేంటో - 50/60 గజాల రోడ్డు బాగుచేస్తేనే పెద్ద ట్రాక్టరు పట్టనంత తుక్కు. అక్కడికీ కొన్ని కొమ్మల్ని మినప చేను రక్షణగా సర్దారు! నేటి స్వచ్ఛ సేవల నడుమ ఐదారుగురు కార్యకర్తలు నిన్నటిదాక జరిగిన రహదారి పనుల జ్జాపకాల్లో ఉన్నారు. అది 50 రోజుల కృషి.  వీధి నిడివి బట్టి చూస్తే ఈ పాగోలు రోడ్డు పనులు 2 వారాల్లో పూర్తి కావాలి.

         ఈ పూట సుందరీకరణల సమయంలో ఒక సర్ప దేవత కూడా ప్రత్యక్షమయిందని విన్నాను. లోతైన బండ్రేవుకోడు కాల్వలో ఆరేడుగురి కృషి పాక్షికంగా విజయవంతమయింది. ఈ  రహదారి అందచందాలు, హరిత గాఢత చూస్తే కంఠంనేని రామబ్రహ్మమే గుర్తొచ్చారు.

         ఈదర వారి ఉపన్యాస కారణంగా నేటి సమావేశం 6.50 కి గా ముగియలేదు. నేటి నినాదాలు పలికిందీ, స్వచ్చోద్యమానికి ప్రభుత్వ సహకారాన్ని వివరించిందీ సర్పంచి ‘కృష్ణకుమారి’ గారు.

         రేపు కూడ స్థానికుల సహకారం పొందుతూ ఇదే పాగోలు రోడ్డులో కలుసుకుందాం.

         జమానాలు తప్పవు గద!

ఒక ప్రక్కన దుర్మార్గం ఒళ్లు విరిచి లేస్తుంటే

గ్రామ వీధి మార్జిన్ల దురాక్రమణలు పెరుగుతుంటె

బుసలు కొట్టి కాలుష్యం భూమిని మ్రింగేస్తుంటే

స్వచ్ఛ సుందరోద్యమాల జమానాలు తప్పవు గద!

- నల్లూరి రామారావు,

   13.03.2025