3412* వ రోజు ....

 గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ!

శుక్రవారం (3412) నాటి శ్రమదాన వార్తలు

         వాటిని వ్రాస్తున్నది నల్లూరి రామారావు – ఏరోజుకారాజు తమ వేకువ చర్యల ఫోటోలనూ (ఈ సౌజన్యం శంకర శాస్త్రీజీది!) కాయకష్ట సమాచారాలను చూస్తూ – చదువుతున్నది స్వచ్చ సుందర కష్ట జీవులు!

         నా పస లేని, మసాలా చాలని వార్తా కధనాలను నూరు శాతం శ్రమదాతలు పూర్తిగా చదవడం లేదని నాకెక్కడో అనుమానం! ఐతే – వీటిని క్షుణ్ణంగా చదివే – విశ్లేషించే సురేశ్ నాదెళ్ళ, రామకృష్ణ ప్రసాదు దాసరి వంటి పాఠక మిత్రులు కూడ ఉన్నారనుకోండి! ఈ రచనలోని వాక్య  నిర్మాణాన్ని, పద ప్రయోగాల్నీ పట్టి పట్టి చదివే మరి కొందరూ ఉన్నారు సుమా!

ఇక అసలు విషయాని కొస్తే:

- ఈ వేకువ పనులు కూడ పాగోలు గ్రామ పరిధిలోనే!!

- రెగ్యులర్ కార్యకర్తలు ముగ్గుర్నలుగురూ, పాగోలుకు చెందిన క్రొత్త వారు మరో ఇద్దరు ముగ్గురూ రానందున ఈ పూట శ్రమకారుల సంఖ్య 32 కే పరిమితమయింది.

- పని చోటు 2వ గృహ సముదాయం దాక - పాగోలు బాటలో

- పనుల ప్రారంభ, ముగింపు వేళలు 4.14 - 6.14 = 2 గంటలు.

- దొరికిన తుక్కు ట్రాక్టరు నిండుగానూ, గ్రామ ప్రయోజనాత్మక కృషి వల్ల కార్యకర్తలకు దక్కిన సంతృప్తి కొలవలేనంతగా! ఆ సంగతి నినాదాల, సమీక్షల వేళలో అందరి ముఖాల్లో తెలిసిపోయింది.

- కొమ్మల ట్రిమ్మింగుతో చెట్ల సుందరీకరణ జరిగి, డ్రైను కడ్డంగా పడిన ఎండు చెట్టును ఇద్దరు శ్రీనివాసుళ్ళు చాలా కష్టపడి నరికి తొలగించి, వీధి ఊడుపులు ఎప్పటిలాగే కొనసాగి,

         భారీ వృక్షాలతో, శుభ్రతతో పాగోలు బాట ఇప్పుడెంత ఆహ్లాదకరంగా మారిందో, తొమ్మిదేళ్ల నాటి రోడ్డు దరిద్రం గుర్తున్నవాళ్ళకి తెలుస్తుంది!

         రోడ్డు దక్షిణాన తొలి ఇంటి వద్ద యడ్ల శ్రీకాంత్  గారి నినాదాలతోనూ, తన మనుమరాలు శ్లోక పేర నల్లూరి శివకుమారి 5000/- చెక్కు ప్రదానంతోనూ, రామబ్రహ్మం వంటి వారి స్మరణతోనూ తుది సభ రక్తి కట్టింది.

         రేపటి వేకువ ఈరోజు ఉదయం జరిగిన సమావేశంలో అనుకున్నట్లుగా కాకుండా  విజయవాడ రోడ్డులోని MDO ఆఫీస్ వద్ద కలుసుకుందాం.

         ఎందుకంటే ప్రతి 3 వ శనివారంలాగానే రేపు ఉదయం 10 గంటలకు పంచాయితి ఆఫీస్ నుండి చల్లపల్లి బస్టాండ్ వరకు జరిగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యతిరేక పాదయాత్రలో స్వచ్చ కార్యకర్తలు కూడ ఐచ్చికంగా పాల్గొనవలసిఉన్నది.        

        ఓర్పు నేర్పు పాఠాలకు

ఐకమత్య ఘనతలకూ, మానవ శ్రమ మహిమలతో

సామూహిక సామాజిక శ్రమ ఫలితపు వింతలకూ,

ఒక సుదీర్ఘ కాలంగా ఓర్పు నేర్పు పాఠాలకు

పాగోలూ – చల్లపల్లి బాట మంచి ఉదాహరణ!

- నల్లూరి రామారావు,

   14.03.2025.