3413* వ రోజు ....

 గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ!

3413* వ శ్రమ వైఖరులు!

         అవి శనివారం (15.3.25) వేకువకు సంబంధించినవి, బ్రహ్మముహూర్తమనబడే 4:17 AM కే మొదలైనవి, 49 మంది స్వచ్ఛ కార్యకర్తలున్నూ, 37 గురు పంచాయతి ఉద్యోగ – అధికార పారిశుద్ధ్య సిబ్బంది = మొత్తం 86 గురు పాల్గొన్నవి, మరియూ సాక్షాత్తూ జిల్లా పాలనాధిపతి -  బాలాజీ గారు మచిలీపట్నం నుండి ఇక్కడికి వచ్చి 5.55 కే పారిశుద్ధ్య పనులను సందర్శించినవి! ఉదయం 6:14 దాక M.D.O కార్యాలయంలోనూ, బైటా కాలుష్యాల దుమ్ము దులిపిన కృషి అది!

         మండల పరిషత్ కార్యాలయంలోని నాలుగు సందుల్లోనూ, వెనుక తట్టునా, పనికి రాని చిల్లర - మల్లర మొక్కలూ, సీసాలూ, రేగు ముళ్ల మొక్కలూ, రోడ్ల దుమ్మూ, వెలుపలి వీధి కొంతమేరా, రెవెన్యూ కార్యాలయ వ్యర్ధాలూ నడవల మీద చేరిన ఇసుకా – దుమ్మూ ఇప్పుడున్నవేమో చూపండి.

         మహిళా శిక్షణా భవనం గోడలో మొలిచి పెరిగిన రావి చెట్టును ఆ చీకట్లోనే ముగ్గుర్నలుగురు కుర్ర కార్యకర్తలు పైకెక్కి, చాకచక్యంగా నిర్మూలించడాన్ని చూశాను. ఊరి బయట రహదార్లే కాదు - కార్యాలయాల అంతర్గత సిమెంటు బాటల అంచుల్లోనూ ఈ వాలంటీర్లు బరంతు వేస్తారన్న మాట!

         కార్యకర్తల సంఖ్య పెరగడంతో ఒక దశలో పారిశుద్ధ్య పనిముట్ల కొరత కూడ ఏర్పడింది, త్రాగు నీరు కూడ మళ్లీ తెప్పించవలసి వచ్చింది!

         6.00 కు ముందే పనిచోటుకు వచ్చిన కలెక్టరు గారు 15 నిముషాల్లో ఉభయ కార్యాలయ ఆవరణల్నీ, కార్యకర్తల కృషినీ, లోడైన 2 ట్రాక్టర్లనీ, శుభ్రపడిన చోటుల్నీ, పరిశీలించి, పంచాయతి వారికి సూచనలిస్తూ - వీధి షాపుల పరిసరాన్ని చూసుకొంటూ వెళ్ళిపోయారు.

         అక్కడ మిగిలిపోయిన కార్యకర్తలు కార్యాలయ ప్రవేశం వద్ద నిలబడి, కోడూరు వెంకటేశ్వరుల నినాదాల్ని అనుసరించారు,  

         రేపటి వేకువ బైటి వైద్య బృందం పాల్గొనే చోటు గంగులవారిపాలెం వీధిలోని పద్మాభిరామం నుండే!

        దశదిశలా మారు మ్రోగి.....

ఈ శ్రమ సంస్కృతి పరిఢవిల్లి, గ్రామాల్లో విస్తరించి,

ఊరూ-వాడా స్వచ్ఛత శుభ్రతలే రాజ్యమేలి,

రహదారుల హరిత శోభ ప్రయాణికులనావరించి,

స్వచోద్యమ చల్లపల్లి దశదిశలా మారు మ్రోగి.....

- నల్లూరి రామారావు,

   15.03.2025.