గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ!
పదముగ్గురు విశేష అతిథులూ + 52 మంది కారకర్తలూ -3414* వ రోజు
13 మంది విశిష్టులూ ఇతర జిల్లాల నుండి పొరుగు రాష్ట్రం నుండి 3-4 వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన, పైకి సామాన్యంగా కనిపించే అసామాన్యులు! సామాజిక బాధ్యతా బద్ధులు! వారేదో వందల వేల కోటాను కోటీశ్వరులూ కాదు, సమాజానికి దశాదిశా బోధపరచ ప్రయత్నిస్తున్న గురువులు!
వారు వచ్చిందీ, నిశితంగా పరిశీలించిందీ, స్వచ్చ కార్యకర్తలతో కలిసి పనిచేసిందీ, ఈ ఊరి 18 వ వార్డులోని గంగులవారిపాలెం వీధిలో 2 గంటల పాటు జరిగిన పారిశుద్ధ్య సుందరీ కరణనే!
జరిగినది ఈ చల్లపల్లి గ్రామంలో వేల రోజులుగా ఏదోఒక మూల జరుగుతున్న పనులే!
- అదుపు కోల్పోయిన చెట్ల సుందరీకరణ, వీధి అందాన్ని చెడగొట్టే గడ్డీ - పిచ్చిమొక్కల తొలగింపూ, ప్లాస్టిక్ భూత నిర్మూలన, వీధి దుమ్ముల ఊడుపూ, షెడ్డర్లో కొన్ని వ్యర్థాలను తుక్కు కొట్టడం వంటి పనులే!
మా ప్రక్కిల్లు మొదలు భవఘ్నినగర్ దాక 6.12 దాక జరిగిన సామాజిక శ్రమ కోలాహలమొక ఎత్తు, 6.25 నుండి 7.40 దాక పద్మాభిరామంలో జరిగిన నేటి శ్రమదాన సమీక్షా సభ ఇంకో పెద్ద కథ! పదకొండేళ్ల స్వచ్చంద శ్రమదానం స్వభావమేంటో - ఇది నేటి దేశానికెంత అవసరమో, ఈ ఆదర్శం అన్ని ఊళ్లల్లో అమలు కావలసినదెందుకో - ఒక్కో వక్తా ఒక్కొ రకంగా సృష్టం చేశారు. ఎందరెందరో నాయకులూ, కవి గాయక కళాకారులూ, పారిశ్రామిక వేత్తలూ గతంలో ఈ చల్లపల్లి వచ్చి, ఈ ఉద్యమాన్ని కీర్తించకపోలేదు.
కాని వాటన్నిటికన్న ఈ గంటంబావు సమావేశం ప్రత్యేకమైనదనీ, సరైన మార్గదర్శకమైనదనీ చెప్పగలను ! ఈ7-8 మందీ కామన్ గా చెప్పింది "ఇలాంటి ఉద్యమాలు అత్యావశ్యకమనీ, వాటిని నడిపే వాళ్ళ నేర్పూ – ఓర్పూ గొప్పవనీ"..
* అంతకు ముందు కొందరు “స్వచ్చ కార్యకర్తలు అదోరకం పిచ్చోళ్లు”అని ముద్దుగా పిలిచే వారు! ఇవాళ ఒక వైద్యకవి కాలేశా వీళ్ళకి “సామాజిక బాధ్యత అనే కిక్కుగాళ్లు” అని క్రొత్త పేరు పెట్టారు!
*ఒక ఉపాధ్యాయుడైతే సి. నారాయణరెడ్డి వ్రాసిన తెలుగు గజల్
" పరుల కోసం పాటుబడని నరుని బ్రతుకూ దేనికని –
మూగ నేలకు నీరందించని వాగు పరుగూ దేనికనీ .... "
* అంటూ పరవశంతో పాడారు!
ఇలాంటి సభల్ని Dr. V. బ్రహ్మారెడ్డి కన్నా బాగా ఎవరు విశ్లేషించగలరు? వీటిని DRK కన్నా ఎవరు బాగా నిర్వహించగలరు?
ఈ తిక్కల బ్యాచ్చి ఇక్కడి కార్యక్రమానంతరం చల్లపల్లినంతా తిరిగి తిరిగి చూస్తున్నది!
మన రేపటి కార్యక్రమం పాగోలు రోడ్డులో అని గుర్తున్నదా?
కట్టే- కొట్టే- తెచ్చే
"కట్టే- కొట్టే- తెచ్చే" కథ వంటిది కాదుసుమా
ఏకాదశ వసంతాలు దాటిన శ్రమ చరితము ఇది
అననుకూల పరిస్థితుల నధిగమించి శ్రమ సంస్కృతి
ప్రజలకు అలవరుస్తున్న కఠినమైన ప్రయత్నమిది!
- నల్లూరి రామారావు,
16.03.2025.