గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ!
3415* వ విడత శ్రమదానాన్ని గుర్తించండి!
1) సోమవారం (17-3-25) కావడమూ,
2) ఒంటి పూట బడులు ప్రారంభం కావడమూ,
3) 13 నుంది అతిథులూ తిరిగి వెళిపోవడమూ,
అనే కారణాలతో నిన్నటి కార్యకర్తల సంఖ్య తగ్గిపోయి, 24 కే పరిమితమయింది.
గ్రామాంతరంలో - చల్లపల్లికి తగుమాత్రం దూరంలో - చందమామ అపార్ట్మెంట్ల వద్ద - 4.20 కే ఒక్క చోటికి చేరిన కార్యకర్తలనబడే నవగ్రహాలను ముందుగా గమనించండి. అసలు కార్యకర్తలు కాక - అపార్ట్మెంట్లు నుండి ముగ్గురో నలుగురో వీధి కాలుష్య కదనంలో పాల్గొన్నారు.
రహదారీ, దాం తాలూకు మురుగుగుంటల కాక - అపార్ట్మెంట్ లోపలి పిచ్చి మొక్కల, ఇంకా ఇతరేతర వ్యర్ధాల జోలికి వెళ్ళడం వల్ల శ్రమ ప్రస్థానం పాగోలు వైపు సాగలేదు. గేటులకల్లిన పిచ్చి తీగల్ని వదిలించడానికే ఇద్దరికి సమయం ఖర్చయింది.
దక్షిణం ప్రక్క నివాసాల నుండి కావచ్చు, లేక వీధి ప్రయాణికులు విసరడం వల్ల కావచ్చు – డ్రైన్ లో ఈ 2 రోజుల్లో మళ్లీ ప్లాస్టిక్ వ్యర్ధాలు చేరినవి. అందుకు తగ్గట్టుగానే అక్కడ పని చేసిన 10 మంది ఓర్పులూ-నేర్పులూ పనికొచ్చాయి!
పెద్దగేటు వద్ద గాని, 100 గజాల రోడ్డు మీద గాని మహిళా కార్యకర్తలు ఊడ్చిన వ్యర్ధాల పోగులు 6.30 కు కూడ అక్కడే మిగిలిపోయినవి.
పల్నాటి కార్యకర్తల జంటైతే అచ్చంగా 4 రోజుల క్రితం శుభ్రపరిచిన బ్రహ్మం గారి గుడీ – బండ్రేవుకోడు వంతెన ప్రాంతాల పరిశుభ్రతకే కట్టుబడింది. ఈ జంటగానీ, ఇతర కార్యకర్తలు గానీ ‘నిలబడి నీళ్లు త్రాగే’ రకాలు – తొందరగా - పైపైన శుభ్రపరుచుకుపోయే హడావుడి గాళ్లు కాదు!
6:25 కే మొదలైన తుది సరదా సంభాషణ సమావేశం మాలెంపాటి డాక్టరు గారు నినాదాలతో ప్రారంభమై, షరామామూలే - అసలా DRK డాక్టరేమన్నా
“తలా పది కోట్లు సంపాదించేయండి – మేడలూ, మిద్దెలూ చూసుకొని ఆనందించండి..” అని చెప్పేరకమా? ఇవాళ్టికివాళ నిన్నటి అతిధుల ఒకొక్కరి సామాజిక బాధ్యతా చరిత్రలే అతడు వివరించింది! విని కార్యకర్తలు సంతోషించకేం చేస్తారు? వీళ్లు చాల వరకు ‘తేడా’ గాళ్లే కదా మరి!
మన రేపటి ఉషోదయ పూర్వ శ్రమ కూడ ‘చందమామ’ అపార్ట్మెంట్ల వద్దేనట!
ఈ కలివిడి - ఈ సందడి
“ఈ పరోపకారక శ్రమ, ఈ కలివిడి - ఈ సందడి
ఎన్ని మురికి పనులైనా ఇష్టంగా చేయు తీరు
ఊరు బాగు పడేదాక ఉడుం పట్టు పనుల జోరు –“
ఇవే గదా చల్లపల్లి స్వచ్ఛోద్యమ మహోన్నతలు!
- నల్లూరి రామారావు,
17.03.2025.