గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ!
మంగళవారం (18-3-25) నాటి మహత్తర వీధి సేవ - 3416*
వీధి పాగోలు గ్రామానికి చెందిన గృహ సముదాయం దగ్గరిదే! కాకపోతే నిన్నటి వలె కాక – స్ధానిక గృహస్తులు - కనీసం 6 గురు వచ్చి, 29 మంది ముదురు కార్యకర్తలతో కలిసి, 35 మంది నిర్వహించిన సేవ అది.
సుందరీకరణ సంఘం కనుక తొలి రోజే చేసిన అదనపు అలంకరణకు పూనుకోక మిగిలిన వాళ్లతో కలిస్తే NTR స్కూలు వైపుగా పారిశుద్ధ్య కృషి బాగా పురోగమించేదే.
ఇంకా సిమెంటు బాట ప్రక్కల బరంతుల జోలికి పోలేదు - పోతే వీధి సేవల పరిధి మరింత తగ్గేదే!
అదేమిటో - ఒక గృహిణి నాలుగవ, ఐదవ రోజులు బ్రహ్మం గుడి – బండ్రేవు కోడు వంతెనల శుభ్రతకే కట్టుబడ్డారు!
మరొక నర్సు గారు అపార్ట్మెంట్ల వీధి లోపలి అందచందాలకు పరితమయ్యారు!
ఇక మిగిలిన కార్యకర్తలా? వీళ్ళకేంలోటు? - సాంతం చివరి వీధి గేటు వద్ద కావలసినంత వ్యర్ధాలుండగా! మహిళా కార్యకర్తలకైతే ఈ 150 గజాల సిమెంటు రోడ్డూ – ఉత్తరపు లోతైన డ్రైను గట్టూ చాల పని చూపెట్టాయి!
సమీప భవనాల వారు మాత్రం కాస్త ఆవేశపడినట్లున్నారు - వాళ్ల ఒంటి చెమటలే ఆ సంగతి చెపుతున్నవి!
ఎట్టకేలకు - భవన సముదాయాల గేటులన్నీ దాటుకొని ఆరేడుగురు కత్తుల – దంతెల వారు పడమరగా - పాగోలు వైపు 30-40 గజాల దాక డ్రైను శుభ్రతను సాధించారు.
చల్లపల్లి-పాగోలు స్వచ్ఛ సుందరోద్యమాలకు కావలసిందిదే - ఇలా స్థానికులు తమ వాడ దగ్గర పనుల్లో సహకరించడం!
నేటి నినాదాల్నీ, సూక్తిముక్తాలనీ అడపా గురవయ్య వినిపించగా, DRK గారు నేటి పనుల్ని సమీక్షించగా,
రేపటి పనుల కోసం ఇదే పాగోలు బాటలో కలవాలని నిర్ణయించుకొని, విడిపోయారు!
చాటింపులు వేస్తున్నవి!
ఈ శుభ్రపడిన రహదారులు, శోభస్కరమగు వీధులు,
అడుగడుగున హరిత శోభ, ఆహ్వానం పలుకు పూలు
తీరైన శ్మశానాలు, హంగులతో టాయిలెట్లు..
స్వచ్ఛోద్యమ ఘనత గూర్చి చాటింపులు వేస్తున్నవి!
- నల్లూరి రామారావు,
18.03.2025.