ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వద్దని చాటుదాం – మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం.
మళ్లీ పాగోలుకు తరలిన 3 444* వ శ్రమదానం!
ఈ మంగళవారం (15-4-25) వేకువ పాగోలు ముఖ్య వీధిని సేవించిన ధన్యాత్ముల సంఖ్య కాస్త పొదుపు పాటించి, 26 కే పరిమితమయింది. ఈపూట కూడ రహదారి పనులు రాముబ్రహ్మం గారి స్థలం దాటి పోలేదు.
దాని ముఖ్య కారణం రోడ్డుకు దక్షిణపు డ్రైనులోని చిన్నా-పెద్దా పిచ్చి చెట్లూ, గడ్డీ, వరిచెత్తా, ప్లాస్టిక్ వ్యర్ధాలే! రేపో-మాపో బోదెలకు నీళ్లు వస్తున్నందున ఉత్తరపు డ్రైను మరమ్మత్తులకు 10 మంది దిగడం మరొక కారణం!
కార్యకర్తలు కాస్త తగ్గినా, పని చోటు సైతం తక్కువే ఐనా వ్యర్ధాల పరిమాణం తగ్గలేదు.వ్యర్ధాల్ని ఎత్తి మోయడంలో ఆలస్యానికి కారణం మాత్రం రెండు ప్రక్కలా సుందరీకరింపబడిన గద్ద గోరు ముళ్ల చెట్ల కొమ్మలే!
ప్రధానంగా షణ్ముఖ వ్యాపారీ, అప్పుడప్పుడూ నేనూ పూనుకోవడంతో-2 రకాల ప్లాస్టిక్ వ్యర్ధాలు 2 గోనె సంచుల్నిండాయి!
ఈ 15-20 రోజుల్నుండే పారిశుద్ధ్య పనులకు దిగిన కళాశాలల డైరెక్టర్ గారు-విజిలు మ్రోగినా, 6-7 నిముషాలు పనివేళ దాటినా ఖాతరు చేయకుండా డ్రైనులోనే వంగి పని చేస్తున్న 4 గురు ఎప్పుడు నడుములెత్తుతారా అని చూడడం గమనించాను!
దైనందిన గ్రామ పారిశుద్ధ్య చర్యల్లో రాశికన్నా వాసి ముఖ్యమనుకొంటే-నేటి తమ కృషి పట్ల కార్యకర్తలు పూర్తి సంతృప్తులే!
ఇంతదాక చేసిన-రేపు చేయవలసిన బాటను చూస్తే-వ్యత్యాసమేమిటో-కిలోమీటరు పైగా రహదారి అందచందాలు ఎంత శ్రమిస్తే వచ్చాయో-ఎవరైనా గ్రహించగలరు!
కార్యకర్తల్లో పెద్ద దిక్కులో ఒకరైన సజ్జా ప్రసాదు గారే నేటి నినాదాలతో తుది సభా ప్రారంభకులు! శ్రమదాన సౌభాగ్యాన్ని వివరించడానికి పదాలు వెదుక్కొన్న Dr.డి.ఆర్.కె. గారే సమీక్షకులు! చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తల కఠిన శ్రమను చూస్తే ఆయనకు సి.నా.రెడ్డి వ్రాసిన గజల్
“పరుల కొరకు పాటుబడని నరుని బ్రతుకు దేనికనీ-
మూగనేలకు నీరందించని వాగుపరుగూ దేనికనీ...”గుర్తొచ్చిందట!
తన మనుమలిద్దరి పుట్టిన రోజుల గుర్తుగా కడియాల భారతి గారి 2000/- విరాళం ఉద్యమ ఖర్చులకు దక్కింది.
చల్లపల్లి మెహర్ రైస్ మిల్ యజమాని చుండూరి MVRK ప్రసాద్ గారు తమ కనిష్ట పుత్త్రుని వివాహ కానుకగా, గ్రామం పట్ల తమ బాధ్యతగా చల్లపల్లి గ్రామ మెరుగుదల కోసం 5 వేల రూపాయలు సమర్పించినందుకు కార్యకర్తల ధన్యవాదములు.
మరొక స్వచ్ఛ చల్లపల్లి అభిమానీ, వెలివల సీతారామాంజనేయులు (వక్కలగడ్డ) గారి కుమారులు (NRI), కుటుంబరావు గారు గత నెలలో 10,000/- కాక మళ్లీ నిన్న 10,000/- ‘మనకోసం మనం’ ట్రస్టుకు పంపినందుకు మన ధన్యవాదములు!
రేపటి శ్రమదానం కూడ పాగోలు దగ్గరనే!
శ్రమదానం తప్పని సరి!
సామూహిక ప్రయత్నముంటే-సమైక్య భావన ఉంటే-
‘మన గ్రామపు మంచి చెడులు మనవే’ అను స్పృహ ఉంటే-
‘పరిసరాల శుభ్రతలే ప్రజారోగ్య’ మని తెలిస్తే.....
చల్లపల్లిలో వలె ఇక శ్రమదానం తప్పని సరి!
- నల్లూరి రామారావు
15.04.2025.