ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వద్దని చాటుదాం – మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం.
ముచ్చట గొల్పిన 36 మంది శ్రమదానం - @3447*
సదరు శ్రమ విశ్వావసు నామ సంవత్సర చైత్ర శుక్రవాసరానికి చెందినది (18-4-25); 25); వేకువ 4.20-6.10 కాలాల నడుమ పాగోలు వడ్లమర ప్రాంతంలో జరిగినది; బాట ప్రక్కల గడ్డినీ, అమర్యాదగా పెరిగిపోతున్న చెట్ల కొమ్మల్నీ, రోడ్డెక్క జూస్తున్న వరి పొట్టునూ, ఎక్కడెక్కడి ప్లాస్టిక్ తుక్కుల్నీ, ఖాళీ సీసాల్నీ తుడిచిపెట్టి, 100 గజాల వీధినీ, డ్రైనునూ నయన మనోజ్ఞంగా రూపొందించిన నేటి కాలపు ఆదర్శ శ్రమవేడుక అది!
రేపటి తరం సుఖసంతోషాల కోసం నేటితరం వృద్ధులూ, గృహిణులూ, రైతులూ, ఉద్యోగులూ, వృత్తి నిపుణులూ సమాజానికి నేర్పుతున్న పాఠమది! ఇదేదో నీటి బుడగ కాదు - త్వరలో పుష్కరాన్ని సమీపిస్తున్న శ్రమ సందేశం!
ఘనత వహించిన ఓ పాగోలూ - చల్లపల్లి ప్రజలారా!
అమెరికా నుండి పనిమీద వచ్చి, తమ ఇళ్లకు 3-4 కిలోమీటర్ల దూరంగా పాగోలు వీధులు శుభ్రపరచే అవకాశం వదలుకోని తుమ్మల లక్ష్మి వేణుశ్రీ, కొడాలి దీపిక కష్టాన్ని గుర్తించరా?
7.30 కు ఉద్యోగ విధుల్లో చేరవలసిన ఉపాధ్యాయులెందుకు భౌతిక శ్రమకు పూనుకొంటున్నారో ఆలోచించరా? పదకొండేళ్ళ శ్రమదానం ఏం సాధించిందని చర్చించరా?
డాక్టర్ల-మందుల-అవసరాన్ని తగ్గించగల, మానసికోల్లాసం దక్కించగల, మన పిల్లల భవిష్యత్తు కోసం పర్యావరణాన్ని రక్షించగల స్వచ్ఛంద వేకువ శ్రమదానంలో ఇప్పటి నుండైనా పాల్గొనరా?
మనమేమీ
“ఎముకలు క్రుళ్లిన-వయస్సు మళ్లిన” సోమరులం” కామే!
చైతన్యవంతమైన చల్లపల్లి ప్రాంతీయులమే!
మన వీధుల్నీ, డ్రైన్లనీ, మన ఇళ్ల పరిసరాల్నీ దశాబ్దం పైగా స్వచ్చ కార్యకర్తలు శుభ్రపరస్తుంటే ఇంకా-ఇంకా చూసీచూడనట్లుందామా?
అరుగో-6.20 వేళ-ప్రాభాత ప్రాంగణ చల్లగాలికి ఒంటి చెమట ఆరుతుండగా కాఫీలు సేవించి, కేశవరావు గారు శ్రమదాన సందేశాత్మక నినాదాలు చేస్తుండగా, క్రొత్తగా రామానగర యువతులు ఈ దైనందిన కార్యక్రమాన్ని ఒక అద్భుతమని మెచ్చుతుండగా-పరిశుభ్రతల పూర్వాపరాలను DRK గారు సమీక్షించగా, నేటి తమ శ్రమ ఫలితాన్ని చూసుకొంటున్న కార్యకర్తలు!
రేపటి తమ శ్రమ స్థలం కూడ పాగోలులోనే అని గ్రహించి, 12:00 కు ముత్యాల చిరంజీవుల్ని ఆశీర్వదించాలని గుర్తుంచుకొని, ఇళ్ళకి పోతున్నారు.
అదృష్టం ఉండొద్దా
పాల్గొన్నది కొద్దిమందె పాగోలను ఊరి నుండి
డ్రైనుల - మొక్కల - పాదుల రమణీయత పెంచేందుకు
వందలాది గ్రామస్తులు శ్రమకు బాగ దూరస్తులు
అదృష్టం ఉండొద్దా అంత మంచి బాధ్యతలకు?
- నల్లూరి రామారావు
18.04.2025.