ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు మానేసి – మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం.
ఇంకా ముగియని పాగోలు వీధి పారిశుద్ధ్యం!-@3448*
పారిశుద్ధ్య ప్రక్రియ శనివారం(20-4-25) వేకువ సమయానిది; 11+27 మంది మహిళా- పురుష కార్యకర్తల నేటి కదన రంగం వడ్లమర ప్రాంతమే! అక్కడ లోతైన డ్రైనూ, ఏపుగా, దట్టంగా పెరిగి నీటి నడ్డుకోగల గుర్తు తెలియని చెట్లూ, 50 గజాల బాట ఉత్తరపు జాగా, బెత్తెడు మందపు నానా గలీజులు చాలవా- 15-20 మందికి పని చూపడానికి?
దారి దక్షిణాన సిమెంటు గచ్చే గాని, కొన్ని సందుల్లో, చిల్లర దుకాణం వద్దా, ట్రాన్స్ఫార్మర్ దగ్గరా నిన్న మిగిలిన వ్యర్ధాలెన్నో చూశారా? అదీగాక, కొందరు కార్యకర్తలు- ముఖ్యంగా మహిళా సుందరీకర్తలకు ఎంతగా శుభ్ర – సుందరీకరణం జరిగితేనో తప్ప సంతృప్తి కలగదాయె! ఊక అడుగున దాగున్న వ్యర్ధాల్నీ, గోడ ప్రక్క జాగాలోని చెత్తనీ వాళ్లు వదలక పోతిరి!
వనితా వాలంటీర్ల సంఖ్య పెరగడమూ, U.S.A. నుండీ, రామానగరం నుండే కాక- కూరపాటి వారి కోడలు సైతం దిగడంతో నేటి శ్రమదానంలో వారి హవా కనిపించింది.
7.40 కల్లా పాఠశాలల్లో "క్లీన్ - గ్రీన్ " కార్యక్రమంలో చేరవలసిన పంతులు గార్లు వేకువ వేళ- అదీ చల్లపల్లికి దూరంగా వీధి మురికి పనుల్లో దిగడం ఒకరకంగా సాహసమనుకోవాలి.
మరి - ఇంతా జేసి – వడ్లమర వారు పాల్గొన్నారు తప్ప – మాజీ సర్పంచి గారి పెనిమిటి చేసిన శ్రమదానం తప్ప – చిల్లర దుకాణాల10-12 గృహాల వారిందులో పాల్గొన్నారా? లేదే – వాళ్లకేదో బిడియం - ఏదో సంశయం - బెరుకు!
సగం మందికి చెమటలు పట్టి, బట్టలు చెమటకు నానుతున్నది నిజమే గాని, శీతల పవన దేవుడు వారి అలసటను తీరుస్తూనే ఉన్నాడు. పైగా ఇదేదో ఎవరికి వాళ్ళు చేసుకొంటున్న శ్రమ కాదు; సామూహిక- సామాజిక సద సద్విచక్షణా పూర్వక సందడి - అలసట తెలియనీయదు!
ఈ ఉదయం కాఫీ పానీయానంతరం నేటి శ్రమ వైభవాన్ని కీర్తించే ప్రతిజ్ఞలు చేయించినది పల్నాటి భాస్కరుల వారు! ఉద్యమ దిన సరి ఖర్చులకు 5000/- విరాళ మొసంగినది కూరపాటి సుబ్బారావు మహోదయులు! ఈ పూట పాగోలు తుది మెరుగులు దిద్దుట కుదరనందున -
రేపటి శ్రమదానం కూడ ఈ పాగోలు సెంటరు ప్రాంతమందే అని ప్రకటించినది DRK వైద్యుల వారు.
కార్యకర్తె పూజారిగ
ఇంచుమించు నెలనాళ్లుగ ప్రతిదీ ఒక శుభ వేకువ
ఇంత చిన్న రహదారికి కార్యకర్తె పూజారిగ
దిన దినమూ గంటన్నర చెమటలె పూజా ద్రవముగ
అందుకె పాగోలు బాట అంతగ అందాలొలకుట!
- నల్లూరి రామారావు
19.04.2025.