ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను మనమంతా వాడొద్దు!
13.06.2025 శుక్రవారం 3498* వ రోజు స్వచ్ఛ సేవలు!
వేకువ జాము 4:15 ని. హైవే రోడ్ లోని బస్టాప్ వద్ద 10 మంది కార్యకర్తలతో పని మొదలై ఎంతో ఉత్సాహవంతంగా జరిగింది. రోడ్డు దిగువ భాగాన నీడనిచ్చే చెట్లు నాటడానికి ముందుగా సిద్దం చేసుకున్న గోతులలో తురాయి, స్పితోడియా, నేరేడు మొత్తం కలిపి 70 మొక్కలను ఇద్దరు ఇద్దరు కార్యకర్తలు కలిసి బృందాలుగా ఏర్పడి మొక్కలను జాగ్రత్తగా నాటడం జరిగింది.
స్వచ్ఛ కార్యకర్తల శ్రమను చూసే కొంతమందికి మొక్కలు నాటడమేగా మనమైనా నాటగలం అనిపిస్తుంది. కానీ ఆ పనికి ఒకరు మొక్కలు అందించడం, ఒకరు క్రిందికి తీసుకెళ్ళి అందించడం, మరొకరు ఎక్కడ పెట్టాలో నిర్ణయించడం, ఒకరు పాతడం, ఒకరు పూడ్చడం ఇలా ఎంతో మంది సమిష్టి కృషి, అకుంఠిత దీక్షా, క్రమశిక్షణ వారు నిర్దేశించుకున్న లక్ష్యం ఇవన్నీ కలిస్తేనే నేడు చల్లపల్లి నాల్గు దిక్కులా పచ్చగా కనువిందు చేసే ముప్పై వేలకు పైగా మొక్కలు.
వేకువనే చిరుజల్లులు పడినప్పటికీ వెంటనే వర్షం నిశబ్దమై వనమహోత్సవానికి రమ్మని కార్యకర్తలను ఆహ్వానించింది. చల్లని వాతావరణంలో కాసానగర్ జంక్షన్ నుండి కొత్తూరు జంక్షన్ వరకు హైవే రోడ్డులో ఎడమ వైపు మొక్కలను కార్యకర్తలు నాటడం జరిగింది.
6 గం.ల కల్లా 70 మొక్కలను నాటి విజిల్ మ్రోగే సరికి పని పూర్తి చేసి కాఫీ కబుర్లకు విచ్చేశారు.
అనంతరం సమీక్షలో మన కార్యకర్త రాయపాటి రాధాకృష్ణ గారు పలికిన జై స్వచ్ఛ సుందర చల్లపల్లికి జై కొట్టి,
రేపు కలువవలసిన ప్రదేశం కొత్తూరు జంక్షన్ (హైవే) దగ్గర బస్టాప్ వద్దనేనని నిష్క్రమించారు.
శ్రమ జీవే జగతికి మూలం
చెమటోడ్చక జరగదు కాలం
రేపన్నది మనదే నేస్తం
శ్రమశక్తే విశ్వ సమస్తం!
- నందేటి శ్రీనివాస్
ప్రజాకళాకారుడు
13.06.2025
*పుష్కరకాలపు శ్రమలను*
వేకువ శ్రమ ఎందరినో విస్మయపరచుట కంటిని
పుష్కరకాలపు శ్రమలను పొగడుట గమనిస్తిని
ముప్పది వేలకు పైగా మొక్కలు కొందరికిష్టము
అడుగడుగున ఊరంతా అందం మెచ్చనిదెవ్వరు?
- నల్లూరి రామారావు,
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త.
లాస్ ఏంజల్స్, USA.
13.06.2025.