ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం మానేద్దాం!
14.06.2025 శనివారం 3499* వ రోజు పని పాటల విశేషాలు!
తెల్లవారు జామున 4:14 ని.లకు హైవే రోడ్ లోని కొత్తూరు జంక్షన్ సమీపంలో బస్స్టాప్ వద్ద 14 మందితో స్వచ్చంద యజ్ఞం ప్రారంభమయింది. రోడ్డుకు అంచున ఉన్న సువర్ణ గన్నేరు మొక్కల చుట్టూ మరియు రోడ్డుకు దిగువ భాగాన ఉన్న నీడనిచ్చే మొక్కల చుట్టూ పిచ్చి గడ్డి తొలగించడం, అలాగే ప్లాస్టిక్ వ్యర్ధాలను ఏరివేయడం, దంతులతో పిచ్చి గడ్డిని పైకి లాగి ప్రోగు పెట్టడం జరిగింది. మహిళా కార్యకర్తలు చీపుళ్ళతో ఎప్పటికప్పడు జరిగిన పని వెనుక శుభ్రం చేయడంతో ఆ ప్రాంతం ఎంతో చూడచక్కగా ఉంది.
ఈరోజు జరిగిన స్వచ్ఛ సేవలో పాల్గొన్న మొత్తం 31 మంది చాలా ఉత్సాహంగా పని చేశారు. స్వచ్ఛ సేవకు మేము సైతం అంటూ మహిళలతో కలిపి మొత్తం 13 మంది ఆసుపత్రి సిబ్బంది పాల్గొనడం విశేషం.
కొందరు కార్యకర్తలు గంగులవారిపాలెం రోడ్ మొదట్లోని స్వచ్ఛ చల్లపల్లి స్వాగత ద్వారం వద్ద స్వచ్ఛ చల్లపల్లి బోర్డును పాతి కాంక్రీట్ వెయ్యడం జరిగింది. ఈరోజు డాక్టరు గారు లేకపోవడం విజిల్ మ్రోత వినిపించక 6 గం. దాటిన తరువాత అందరూ పనికి విరామమిచ్చి కాఫీ సేవించడం జరిగింది.
చల్లని వాతావరణంలో ఆ సమయంలో అంతమంది కలిసి ఒక లక్ష్యం కోసం పనిచేస్తూ విరామ సమయంలో కాఫీ ముచ్చట్లాడుకొంటుంటే వెళ్ళే పోయే వాహనాలలో వారికి ఈ ఉద్యమ ప్రస్థానం తెలియనివారు ఏమిటి ఇంతమంది ఈ సమయంలో గుమిగూడటం అనుకొంటూ విస్తుపోవడం వారివంతయ్యింది.
సమీక్షా సమావేశంలో చిన్న డాక్టర్ గారైన డా.వరప్రసాదు గారు పలికిన జై స్వచ్ఛ సుందర చల్లపల్లికి అందరూ ముక్తకంఠంతో వంత పలికి,
రేపు ఆగవలసిన ప్రదేశం ‘ఇక్కడే’ అనుకుని నిర్దారణతో నిష్క్రమించిరి.
ఉద్యోగులు మేధావులు – రైతులు చిరువ్యాపారులు
ఒకరికొకరు జట్టు కట్టి – పరిశుభ్రత బాటపట్టి
స్వచ్ఛ చల్లపల్లికి – నేను సైతమంటూ జై కొట్టి
కదిలిన ఒక మహోద్యమం – దేశానికె ఆదర్శం.
- నందేటి శ్రీనివాస్
ప్రజాకళాకారుడు
14.06.2025