ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం మానేద్దాం!
15.06.2025 ఆదివారం 3500* వ రోజు శ్రమదాన విశేషాలు!
వేకువనే 4:17 నిలకు 216 జాతీయ రహదారిలో కొత్తూరు జంక్షన్ దాటిన తరువాత బస్స్టాప్ వద్ద 17 మందితో స్వచ్ఛ సేవలు మొదలై రోడ్డుకు క్రింది భాగంలో ఉన్న తుక్కు, ప్లాస్టిక్ వ్యర్ధాలను పైకి చేరవేసి లోడింగ్ కి అనుకూలంగా గుట్టలుగా చేర్చడం జరిగింది. మరికొంత మంది వంతెన సమీపం వరకు గడ్డిని తొలగించి శుభ్రం చేశారు.
ఈరోజు ఆదివారం కావడంతో “లేచింది మహిళా లోకం” అన్నట్లు ఈరోజు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు గొర్రులతో చీపుళ్ళతో వారిదైన శైలిలో పని చేశారు.
రోడ్డు దిగువ భాగాన ఉన్న రెల్లు గడ్డిని డాక్టరు గారి సూచనల మేరకు కోయకుండా ఎవరైనా ఉపయోగించుకొనడానికి అలాగే ఉంచి వేయడం జరిగింది.
5.30 నుండి నిన్న, ఈరోజు వచ్చిన చెత్తా ప్లాస్టిక్ వ్యర్ధాలను ట్రాక్టర్ లో లోడ్ చేయడం ప్రారంభించారు.
6 గం.ల కల్లా పనికి విరామమిచ్చి కాఫీ సేవించిన పిదప సమీక్షలో లక్ష్మీ సెల్వం గారు పలికిన జై స్వచ్ఛ సుందర చల్లపల్లి నినాదంతో అందరం జేజేలు పలికి రేపు కలవవలసిన ప్రదేశం వంతెన భాగానికి అవతలి ప్రక్కన అని నిర్ణయించుకుని నిష్క్రమించుట జరిగినది.
తప్పనిసరి పని మీద హైదరాబాద్ వెళ్ళిన రధసారధులు ఈరోజు “స్వచ్ఛ సుందర చల్లపల్లి” ఉద్యమం 3500 వ రోజు సందర్భంగా డా.పద్మావతి మేడం గారు హైదరాబాద్ నగరంలో ఒక ప్రధాన వీధిని తెల్లవారుజామున అక్కడ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి శుభ్రం చేయడం జరిగింది.
- నందేటి శ్రీనివాస్
ప్రజాకళాకారుడు
15.06.2025
భవిత మెరుగు పడడమూ!
వారానికి ఒక్కరైన పరిశీలక పర్యాటకు
లిచటికి విచ్చేయడమూ, అందులోని కొందరైన
స్ఫూర్తి నింపుకెళ్లడమూ, శ్రమదానపు సందేశం
రాష్ట్రమెల్ల విస్తరిల్లి భవిత మెరుగు పడడమూ!
- నల్లూరి రామారావు,
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త.
లాస్ ఏంజల్స్, USA.
15.06.2025.