ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం మానేద్దాం.
ది. 17.06.2025 మంగళవారం 3502* వ రోజు శ్రమదాన విశేషాలు!
216 హైవే రోడ్ లోని కల్వర్టు వద్ద తెల్లవారుజామున 4:16 ని. 14 మందితో మొదలైంది. రోడ్డు పొడవున ఒక ప్రక్క మొక్కలు ఎదగడానికి ఆటంకంగా ఉన్న కలుపును, ఎత్తైన పిచ్చి మొక్కలను శుభ్రం చేయడం, ప్లాస్టిక్ వ్యర్ధాలను ఏరివేయడం, గాజు సీసాలను సైతం ఏరి ప్రోగు చెయ్యడం కార్యకర్తలు చేసే అత్యంత బాధ్యతతో కూడిన సేవ.
క్రమక్రమంగా ఒక్కొక్కరి చేరికతో 26 మంది కార్యకర్తల సమూహం ఊరి కోసం పడుతున్న శ్రమ వారు చేస్తున్న కష్టం వర్ణనాతీతం.
ఒకరోజా? ఒక నెలా? ఒక సంవత్సరమా? ఒక దశాబ్దమా? ఏకంగా 3502 రోజులుగా గ్రామ నవీకరణకై, ఆధునిక చల్లపల్లికై అనగా స్వచ్చమైన గాలితో, పరిశుభ్రమైన వీధులతో, మంచి డ్రైనేజి వ్యవస్థతో, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడని ప్రజలతో కంపు కొడుతున్న ఖాళీ ప్రదేశాలన్నీ రహదారి ఉద్యానవనాలతో ఊరి నాల్గు చెరగులా కిలోమీటర్ల పరిధిలో హరితమయంతో పచ్చని చెట్లతో ఉండాలని ప్రజలకు అవసరమైన అనేక మౌలిక సదుపాయాలు కల్పించుటకై కార్యకర్తలు చేస్తున్న సమయ శ్రమ త్యాగం, డాక్టరు గారి దంపతుల మరికొంతమంది దాతృత్వం ఏమాత్రం మాటలలో చెప్పలేనిది.
6 గం. విజిల్ మ్రోగే సమయానికి ఉన్న చెత్తనంతా ట్రాక్టర్లో లోడింగ్ పూర్తి చేసి పనికి విరామమిచ్చి కాఫీ సేవించిన పిదప యువ కార్యకర్త భరత్ “జై స్వచ్చ సుందర చల్లపల్లి” నినాదంతో జత కలిపి జై కొట్టగా,
డాక్టరు గారు మాట్లాడుతూ కార్యకర్తలు చేస్తున్న నిరంతర శ్రమను ఎవరూ పాడు చేయకుండా ప్రజలందరూ కూడా బాధ్యతగా వ్యవహరించి మనతో సహకరిస్తే బాగుంటుందని చెప్పి,
రేపు కలవవలసిన ప్రదేశం ఈ రోజు కార్యక్రమం ముగింపు దగ్గర నుండి అనుకుని నిష్క్రమించారు.
ఊరి బాగుకై తపించే స్వచ్ఛ కార్యకర్తలు వీరయా
వీరి వంటి త్యాగధనులు – విశ్వంలో ఎందరయ్యా!
- నందేటి శ్రీనివాస్
ప్రజాకళాకారుడు
17.06.2025
ఏమాశ్చర్యం! ఎంత విశేషం! – 1
విజ్ఞులందరూ చిత్తగించండి వింత గొలుపు మా ఊరి చరిత్రం
మూడువేల ఐదొందల* రోజుల నిర్విరామమగు శ్రమ సందేశం
అదీ - వేకువన నాల్గున్నరకే వీధులందు శ్రమ స్వైర విహారం
ఏమాశ్చర్యమొ! ఎంత విశేషమొ! సమాజానికిది ఎంత అవసరమొ!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
లాస్ ఏంజల్స్ - USA
17.06.2025.