3597* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

20.09.2025 శనివారం 3597* వ రోజు నాటి స్వచ్ఛ చల్లప్లలి శ్రమదాన ఘట్టములు.

          వేకువజాము 4:20 నిమిషాలకు జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న శారదా గ్రాండియర్ వద్ద  కార్యకర్తలు మొదటి ఫోటో దిగి ప్రధమ ఘట్టమును పూర్తి చేసి చకచకా పనిముట్లు చేతబట్టి హైవేకు ఎడమ ప్రక్క (అవనిగడ్డ వైపు) మొక్కల మధ్యలో ఉన్న కలుపు గడ్డి, కమ్ముకుపోయి ముదిరిన రెల్లుగడ్డిని తుది ముట్టించే కార్యాచరణలో నిమగ్నమయ్యారు.

          నిలబడడానికి వీలులేని ఏటవాలు ప్రదేశంలో పూర్తిగా ఒక కాలి పట్టుపై నిలబడి రెల్లుగడ్డిని కోయడం, కలుపు మొక్కలను లాగివేయడం, పిచ్చి కాడను వదిలించి పెద్ద మొక్కలను బందీలోంచి విడిపించారు.

          కొద్ది మంది కార్యకర్తలు స్వాగతద్వారం నుండి హైవేకు కుడి వైపు సువర్ణ గన్నేరు మొక్కలను క్రింది భాగంలో కత్తిరించి మొక్క పొడవునా కర్రపాతి కంప కట్టడం పూర్తయిన తరువాత చూస్తే సువర్ణగన్నేరు మొక్కల అందాలు ఇక్కడ “సొగసు చూడతరమా” అన్నట్లు ఉంది.

          రహదారి మార్జిన్ మాత్రం కటింగ్ యంత్రంతో చక్కగా కత్తిరిస్తున్నారు. ఈరోజు డా.పద్మావతి గారు కూడా స్వయంగా మిషన్ తగిలించుకుని సమానంగా కత్తిరించడం విశేషం. మిషన్ తో చేయడం వలన హైవే రోడ్ కే అందం వచ్చింది.

          6 గంటల వరకూ చెమటోడ్చిన కార్యకర్తలు విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి కొద్ది నిమిషాలు కాఫీ కబుర్లలో కష్టాన్ని మరచి సమీక్షలో పాల్గొన్నారు.

          ముచ్చు రోహిణి పలికిన జై స్వచ్ఛ సుందర చల్లపల్లినినాదంకు బదులిచ్చి జేజే లు పలికారు.

          లండన్ నుండి విచ్చేసిన చల్లపల్లి గ్రామ నివాసి శ్రీమతి సూరి అనిత గారు, దుగ్గినేని నిశ్చల్ ఈరోజు స్వచ్ఛ సేవలో ప్రత్యక్షంగా పాల్గొన్న విషయాన్ని డాక్టరు గారు ప్రస్తావించారు. వారినివారు పరిచయం చేసుకుని ఇంతకాలంగా జరుగుతున్న ఈ స్వచ్ఛ కార్యక్రమం నాకెంతో ఇష్టమని చెప్పారు. స్వచ్ఛ చల్లపల్లి అభివృద్ధికి 1000/- విరాళం కూడా అందించారు.

          రేపు కలవవలసిన ప్రదేశం వంతెన ముందు బస్టాప్ వద్ద అనుకుని నిష్క్రమించారు.

- నందేటి శ్రీనివాస్

  ప్రజా కళాకారుడు  

  20.09.2025.

          ప్రశ్నల పరంపర – 16

న్యాయమైన ప్రశ్ననొక్కటి నన్ను నేనే అడిగి చూస్తిని

“అమెరికా-లాసెంజలస్ లో ఉన్న నీకేం అర్హతున్నది -

అందరిని ప్రశ్నించుటకు?” అని “ఔను! నిజమే” ననితలంచా –

పాలుగొనుచు శ్రమించువాడే ప్రశ్నవేయుట సమంజస” మని!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   20.09.2025.