3600* వ రోజు ....

  పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

23.09.2025 శుక్రవారం 3600* వ రోజు నాటి స్వచ్ఛ శ్రమదాన కార్యక్రమము!

          ఈరోజు తెల్లవారుజాము 4:18 నిమిషాలకు హైవేలోని కొత్తూరు జంక్షన్ సమీపంలోని బస్ షెల్డర్ వద్దకు కార్యకర్తలు చేరుకున్నారు. మొదటి ఫోటో దిగి చేయవలసిన పనులను బట్టి ఎవరెవరు ఎటు వెళ్ళాలో నిర్ధారించుకుని కార్యరంగంలోకి దిగారు.

          రహదారి మార్జిన్ లో నాటబడిన పూల మొక్కలు, దిగువ నాటబడిన పండ్లు, నీడనిచ్చు మొక్కల చుట్టూ దట్టంగా కమ్ముకున్న కలుపు గడ్డిని కత్తులతో కోసి పిచ్చి చెట్లను కూడా మొదలుకంటూ తీసివేసి మంచి మొక్కలకు రక్షణ కల్పించారు.

          కొద్దిమంది కార్యకర్తలు నిన్న, మొన్న ఎత్తగా మిగిలిన చెత్తను ట్రాక్టర్ లో లోడ్ చెయ్యడం చేస్తూ 2 ట్రక్కుల చెత్తను లోడ్ చేసి డంపింగ్ యార్డుకు తరలించారు.

కార్యకర్తలు చేయగా వచ్చిన చెత్త, తుక్కుని మహిళా కార్యకర్తలు ఒక చోటకు చేర్చి రహదారి ప్రక్కన కోతకు గురైన ప్రదేశంలో చక్కగా చదునుగా చేస్తున్నారు.

          6 గంటల వరకూ పని చేస్తూ ఉన్న కార్యకర్తలు విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి ‘వక్కలగడ్డ రామకృష్ణ గారుపలికిన జై స్వచ్ఛ సుందర చల్లపల్లినినాదానికి జై కొట్టి,

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంలో భాగంగా, నేడు స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 3600 వ రోజు సందర్భంగా డాక్టరు గారు ఈరోజు కార్యకర్తలందరికీ Bamboo Tooth Brush లను అందజేశారు.    

          రేపు మనం కలవవలసిన ప్రాంతం ఈ హైవేలోని బస్ షెల్డర్ ప్రాంతం అనుకుని నిష్క్రమించారు.

          కులం లేదు, మతం లేదు, ప్రాంతీయుత అసలే లేదు, మానవత్వమే మా అభిమతమని నేటికి 3600 రోజులు గడుస్తున్నా ప్రతోరోజూ స్వచ్ఛ సేవకు సమయానికే రావాలన్న తపన, ఊరి కొరకు అంకితభావంతో పనిచేయాలన్న సామాజిక బాధ్యత లక్ష్యం నెరవేర్చడానికి పడుతున్న కఠోర శ్రమ, ఇన్నేళ్ళ సాన్నిహిత్యంలో ఒకరి పట్ల ఒకరికి సానుకూల దృక్పధం, గమ్యాన్ని చేరుకోగలమన్న చెక్కు చెదరని విశ్వాసం వీటన్నింటి పెట్టుబడిగా పెట్టి  ప్రతిఫలంగా పదిమంది కోసం పని చేశామన్న సంతోషాన్ని మాత్రమే మాటకట్టుకు వెళుతున్న ఓ స్వచ్ఛ కార్యకర్తా నీకిదే నా సెల్యూట్..        

- నందేటి శ్రీనివాస్

  ప్రజా కళాకారుడు  

  23.09.2025.

          ప్రశ్నల పరంపర – 19

అందరికి రావాలనే ఉంటది, స్వచ్ఛ సుందర ఉద్యమంలో

పాల్గొనాలని కోరికుంటది; కొంతమందికి తగని బిడియం –

ఇంకొంతమందికి బద్ధకం - మరికొందరేమో సాచివేతా....

సవాలక్షా కారణాలతొ సాగకుంటది అడుగు ముందుకు!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   23.09.2025.