3601* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

24.09.2025 బుధవారం 3601* వ రోజు నాటి స్వచ్ఛ సుందర శ్రమదాన కార్యక్రమము!

          జాతీయ రహదారిపై కొత్తూరు జంక్షన్ దగ్గరలో తెల్లవారుజామున 4:18 నిమిషాలకు కార్యకర్తలు పనికి సిద్ధమయ్యారు. కత్తులతో పిచ్చి మొక్కలను కలుపు మొక్కలను కోయడానికి కొందరు కార్యకర్తలు సమాయత్తమవగా చెత్తా చెదారాలను ప్లాస్టిక్ వ్యర్ధాలను లాగడానికి మరికొందరు గొర్రులతో సిద్ధమయ్యారు.

          దట్టంగా పెరిగి పచ్చగా కళకళలాడుతున్న పారిజాతం మొక్కల చుట్టూ బాగుచేసి పాదు చేయడం. మొక్కలకు అడ్డుగా ఉన్న ముళ్ళ కంపను తొలగించడం లాంటి పనులతో మొక్కల సంరక్షణా చర్యలు చేపడుతున్నారు.

          కొంతమంది కార్యకర్తలు శుభ్రపరచగా వచ్చిన చెత్త వ్యర్ధాలను ట్రాక్టర్ లోకి లోడింగ్ చేసే పని ప్రారంభించి ఒక వ్యక్తి లోడింగ్ నిమిత్తం ట్రాక్టర్ ఎక్కి కొమ్మలను, రెమ్మలను తుక్కును అన్నింటిని ట్రక్కులో అమరే లాగా పేర్చడం ఆ కార్యకర్తకే సాటి.

          గడ్డి కోత యంత్రం పని చేయవలసినంత ఉన్నది.  కానీ ఒక కార్యకర్త కటింగ్ మిషన్ తో ఒక ప్రక్కన మార్జిన్ నువరుసపెట్టి కత్తిరించడం రోజూ అదొక చెయ్యి తిరిగిన పని అయ్యింది. 

          6 గంటల వరకూ విశ్రమించని కార్యకర్తలు 24 మంది విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి కాఫీ సేవించిన పిదప సమీక్షలో పాల్గొన్నారు. టీచర్ లంకె సుభాషిణి గారుపలికిన జై స్వచ్ఛ సుందర చల్లపల్లినినాదానికి జై కొట్టి,

          రేపు మనం ఆగవలసిన ప్రాంతం ఈ బస్ షెల్డర్ ప్రాంతం అని నిష్క్రమించిరి.

- నందేటి శ్రీనివాస్

  ప్రజా కళాకారుడు  

  24.09.2025.

          ప్రశ్నల పరంపర – 20

ప్రభుత్వాలను అడుగుతున్నా - “పదేళ్లుగా మా స్వచ్ఛ సుందర

ఉద్యమంలో ఏకమాత్ర ప్రయోజనం కల ప్లాస్టిక్ వస్తువు

వాడమే మరి, నిషేధానికి మరీ ఇంతటి జాప్యమా!” అని

స్పష్టమగు ఒక సమాధానం వచ్చునని ఆశించు చున్నా!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   24.09.2025.