పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?
01.10.2025 బుధవారం - 3608* వ రోజు నాటి స్వచ్ఛ సేవా సంగతులు!
వేకువ జాము 4.16 నిమిషాలకు కార్యకర్తలంతా జాతీయ రహదారిపై కొత్తూరు క్రాస్ జంక్షన్ సమీపంలో బస్ షెల్టర్ వద్ద కలుసుకుని రోజువారీ చేస్తున్న మొక్కల పరిరక్షణా చర్యలలో భాగంగా ఈ రోజు చేయవలసిన పని ముందుగా అనుకున్న ప్రకారంగా ఎవరి పనిముట్లు వారు చేతబట్టి ముందుకు సాగారు.
గత 2 సంవత్సరాల కాలంలో కార్యకర్తలు నాటిన మొక్కలు మధ్యలో ఒక విడత పని చేసినప్పటికీ వర్షాకాలంలో విపరీతంగా పెరిగిన గడ్డి వలన, పిచ్చి మొక్కల వలన పూల మొక్కలకు ఊపిరాడని పరిస్థితి నెలకొంది. మొక్కలెన్ని ఉన్నా రహదారి ప్రక్క పెరిగిన గడ్డిలో చూడడానికి అంత అందంగా, ఆహ్లాదంగా కనిపించక గత 3 నెలలుగా స్వచ్ఛ కార్యకర్తలు కఠోర శ్రమతో “గ్రీన్ ఆపరేషన్” చేపట్టారు.
గద్దగోరు మొక్కలలో, క్రమం తప్పి పెరిగిన కొమ్మలను ట్రిమ్ చేయడం చుట్టూ పాదులలో కలుపు తీయడం చేస్తున్నారు. ఇంత పూర్తి స్థాయిలో చేస్తున్నందున టన్నుల కొద్దీ చెత్తా చెదారాలు ప్రోగవడం గమనార్హం. చెత్త గుట్టలను కొంతమంది బృందం ట్రాక్టర్ లో లోడింగ్ చేయడం, వారి వెనుకనే మహిళా కార్యకర్తలు శుభ్రంగా చీపుళ్ళతో ఊడ్చి వేయడంతో పని పూర్తయిన భాగం మాత్రం చూడటానికి ఎంతో అందంగా తయారయింది.
రహదారి ప్రక్కన మార్జిన్ లో ఉన్న గడ్డిని “కటింగ్ మిషన్” తో కట్ చేయడంతో అంతా సమానంగా ఉంది.
6 గంటల వరకు విశ్రమించని కార్యకర్తలు విజిల్ మ్రోగగానే పని నిలుపుదల చేసి కాఫీ సేవించిన పిదప జరిగిన సమీక్షలో పాల్గొని, ‘షణ్ముఖ శ్రీనివాస్’ గారు పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” నినాదానికి జై కొట్టి,
రేపటి స్వచ్ఛ కార్యక్రమం కోసం విజయవాడ రోడ్డులోని ‘గాంధీ విగ్రహం’ వద్ద కలుసుకుందాం.
-నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
01.10.2025.
కథాసమయం - ఫల శ్రుతి మయం
(మళ్లీ నిన్నటి తరువాయి)
ఊరి వీధుల, బైటి రహదార్ల ప్రక్కన
చెట్లు ముప్పదివేలు నాటి సంరక్షిస్తె.....
పూవులను కాజేసి, మొక్కల్ని పీకేసి
చెట్లు బూడిద చేయు చిల్లర మనుష్యుల్ని
అధికార్లు - పోలీసులసలు జోలికి పోక
విద్రోహ చర్యలు ఉపేక్షేంతురా? చట్ట
వ్యతీరేక చర్యల్ని ఖండించరా?
నిర్లక్ష్యమిపుడైన నిరసించరా? స్వచ్ఛ
కార్యకర్తల శ్రమకు జై కొట్టరా? ॥ కథవిందురా ॥
గత పదేళ్లుగా కార్యకర్తల శ్రమతొ
జాతీయ స్థాయిలో చల్లపల్లికి ఎన్నొ
సన్మానములు జరిగి గుర్తింపు దక్కినా
ప్రముఖులెందరొ ఇచట పర్యటిస్తున్ననూ
గ్రామస్తులందరి అడుగు ముందుకు పడని
నిర్లక్ష్య మిపుడైన నిరసించరా - స్వచ్ఛ
కార్యకర్తల శ్రమకు జై కొట్టరా? ॥ కథవిందురా ॥
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
01.10.2025