3609* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

02.10.2025 గురువారం - 3609* వ రోజు నాటి శ్రమైక జీవన సౌందర్యం!

               ఈరోజు గాంధీ జయంతిని పురస్కరించుకుని విజయవాడ రోడ్ లోని గాంధీ విగ్రహం వద్ద తెల్లవారుజాము 4.20 నిమిషాలకు కార్యకర్తలు స్వచ్ఛ సేవకు చేరుకున్నారు. రాగానే అందరూ మొదటి ఫోటో దిగిన తరువాత కార్యోన్ముఖులయ్యారు.

గాంధీ విగ్రహం ఎదురుగా రోడ్ మార్జిన్ లో స్వచ్ఛ కార్యకర్తలు నాటిన అలస్తీనియా, గానుగ మరికొన్ని మొక్కలు, పూల మొక్కలైన అడవి తంగేడు మొక్కలలో ఎగుడు దిగుడుగా పడిన కొమ్మలను కత్తిరించడం, మొక్కల చుట్టూ చిన్న చిన్న కలుపు మొక్కలను ఏరివేసి శుభ్రం చేయడం చేశారు.

అడవి తంగేడు మొక్కల కొమ్మలు వంగిపోయి డ్రైనులో పడిపోయిన వాటిని సరిచేసి కాలువ వరకు పరిశుభ్రం చేసారు. గాంధీ విగ్రహం ఎదురుగా ఉన్న సిమెంటు గోడౌన్ ప్రక్కన మార్జిన్ లో మొక్కల చుట్టూ ఉన్న కలుపు, గడ్డిని బాగు చేయడం జరిగింది.

కొమ్మల కత్తెర యంత్రంతో ఒక కార్యకర్త దట్టంగా పెరిగిపొయిన బోగన్ విలియా మొక్కలను ట్రిమ్ చేసి అందంగా చేశారు. మరికొందరు మెయిన్ రోడ్ కు ఎడమ వైపు కాలువ గట్టు మొదట్లో కొంత భాగం కార్యకర్తలు శుభ్రం చేశారు.

గాంధీ విగ్రహం ఉన్న ప్రదేశాన్ని పదిమందీ చూడదగ్గ ప్రదేశంగా తీర్చిదిద్దడానికి డాక్టర్ గారు, మేడమ్ గారు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టడంతో ఈరోజు విగ్రహానికి రెండు ప్రక్కలా టెర్మినేలియా మొక్కల అందాలు, చుట్టూ పూల మొక్కలతో ఆ ప్రాంగణం అత్యంత ఆహ్లాదకరంగా దర్శనమిస్తుంది. సాయంత్రం సమయంలో అక్కడ కూర్చోటానికి ఏర్పాటు చేసిన గ్రానైట్ మెట్లపై కూర్చుని సేదతీరితే ఓ మధురమైన అనుభూతి కలుగుతుంది.

6 గంటల వరకు చెమటోడ్చిన 35 మంది కార్యకర్తలు విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి కాఫీ సేవించిన పిదప సమీక్షలో పాల్గొని,

చి.ఆర్య, ఆరవ్ లు పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” నినాదానికి జై కొట్టి,

డాక్టరు గారి మనుమరాలైన చి. శృతి స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమం ఇన్ని సంవత్సరాలు కొనసాగిస్తున్న కార్యకర్తల కష్టం ఎంతో విలువైనది అని, మీ శ్రమ మాటలలో చెప్పుకున్నంత తేలికైన పని కాదని, నేను నా సహ విద్యార్ధినులతో ఈ ఉద్యమం గురించి ప్రస్తావిస్తూ చాలా గర్వంగా ఫీలవుతానని చెప్పారు.

               స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తల శ్రమతో పంచాయితీకి కూడా స్వచ్ఛ సర్వేక్షణ్ తరపున ఐదు అవార్డులకు వివిధ భాగాలలో ఎంపికవడం ఎంతో సంతోషంగా ఉందని సర్పంచ్ కృష్ణ కుమారి గారు, కార్యదర్శి మాధవేంద్రరావు గారు అన్నారు.

               గురవయ్య మాస్టారు చెప్పిన నీతి సూక్తులు విని,

నేను ఆలపించిన “గాంధీజీ బ్రతికుంటే మీ గడపకొచ్చేను – ఘనమైన మీ పోరు చూసి గర్వించేను” అనే గేయాన్ని విని అందరూ నిష్క్ర మించారు.

రేపటి కార్యక్రమం కోసం హైవేలోని  కొత్తూరు జంక్షన్ వద్ద ఉన్న బస్టాప్ వద్ద కలుసుకుందాం.  

-నందేటి శ్రీనివాస్

  ప్రజా కళాకారుడు  

  02.10.2025.

కథాసమయం - ఫల శ్రుతి మయం

(మళ్ళీ నిన్నటి తరువాయిగా)

కార్యకర్తల కృషిలొ కల్మషం లేదసలు

పదవులొ - ప్రతిష్ఠలో వాళ్లకక్కర లేదు

నా స్వస్తతే వాళ్ల న్యాయమగు కోరికట!

ఇకనైన ప్రజలెల్ల సహకరిస్తే చాలు

చరిత్రలో నా పేరు చిరస్థాయిగ వెలుగు

స్వచ్ఛత శ్రమ వైభవము కీర్తించరా? గొప్ప

శ్రమ సంస్కృతికి మీరు జై కొట్టరా?

               కథ వింటివారి స్వచ్ఛ కథ వింటివా?

               నిరవధిక శ్రమ చరిత్రను కంటిరా?

               పదకొండు ఏళ్లుగా ప్రవహించుచున్న నా

               స్వచ్చంద శ్రమదాన కథ వింటిరా?

* * *              * * *

ఫలశ్రుతి :

               ఈ కథను చదివినను - విని ఆచరించినను

               వివరించినా - ప్రచారము చేసినా చాలు

               మీ ఊరు బాగుపడు - ఆరోగ్యములు పెరుగు

               ఎల్లరకు మనఃశాంతి ఎంతో లభించును!

                              కథమంచి దోయ్! స్వచ్ఛ కథ మంచిదోయ్!

                              శ్రమ సంస్కృతిని నేర్పు కథ గొప్పదోయ్!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  02.10.2025