3611* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

04.10.2025 శనివారం - 3611* వ రోజు నాటి స్వచ్ఛ సేవా సంగతులు!

ఈ రోజు తెల్లవారుజామున 4.21 ని.లకు కార్యకర్తలు జాతీయ రహదారిపై కొత్తూరు జంక్షన్ సమీపంలో బస్ షెల్టర్ ప్రాంగణం వద్ద అందరూ కలుసుకొని ముందుగా అనుకున్న కార్యాచరణ ప్రణాళిక ప్రకారం పనిముట్లు చేతబట్టి పని ప్రారంభించారు.

ఎక్కువ మంది కత్తులు చేతబట్టి మొక్కల ఎదుగుదలకు ఆటంకమైన కొమ్మా, రెమ్మా, కలుపు గడ్డీ, కాడ మొదలగు అవాంతరాలైన వాటిని తొలగించడం, వాటిని వదిలి వేయకుండా మహిళా కార్యకర్తలు గొర్రులతో విరామం లేకుండా లాగి గుట్టలు పెట్టడం, తదుపరి ఒక దళం ప్రత్యేకంగా నిన్న మిగిలిన, ఈ రోజు వచ్చిన చెత్త గుట్టలను లోడింగ్ చేయడం జరుగుతుంది.

ట్రాక్టర్ లోడింగ్ లో కూడా కార్యకర్తలు తమదైన శైలి, ఒకరు గుట్టలను గొర్రులతో కదిపి దాని క్రింద ఎలాంటి ప్రమాదకర పురుగులు ఉన్నా కనిపించే లాగున చెయ్యడం, ఒకరు పెద్ద కంప అందించడం ఒకరు ట్రాక్టర్ లో ఎక్కి ఎంత మించిన లోడైనా గట్టిగా తొక్కి సర్ది పెట్టడం, మరొకరు తుక్కును డిప్పల కెత్తడం చూడటానికి బలే ఆశ్చర్యంగా ఉంటుంది. వీరు చేస్తున్న పద్ధతిని దగ్గరగా చూస్తే ఎలాంటి మిషనరీ లేకుండానే ఇదొక “వేస్ట్ మేనేజ్ మెంట్ ప్రోసెసింగ్ సిస్టం” లా అనిపిస్తుంది.

గడ్డి కటింగ్ మిషన్ తో రెండు ప్రక్కలా మార్జిన్ లు కట్ చెయ్యడం వలన రహదారి అందంతో పాటు ఎన్నో గంటల కార్యకర్తల శ్రమ వృధా కాకుండా ఉంటుంది.

వాతావరణం కూడా అల్పపీడన ప్రభావంతో వర్షం రాకుండా చల్లగా ఉండటం ఆ వేకువ సమయాన ప్రభోద గీతాలు వింటూ ఒకరినొకరు పెద్దగా పలకరించుకుంటూ, మరికొంత మంది కూని రాగాలు తీస్తూ మైక్ తో వంత పాడుతూ, పనిమీద జోకులు వేస్తూ ఉత్సాహంగా ఊరి కొరకు పని చెయ్యడం చూసే వారికి మామూలుగా అనిపిస్తుందేమో గాని స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలకు ప్రతిరోజూ “అదొక కిక్కే”.

అలా 6 గం.ల సమయం వరకు పనిచేసిన సైనికులు రథ సారథి విజిల్ మ్రోతకు పనికి విరామమిచ్చి, కాఫీ సేవిస్తూ కొద్ది నిముషాలు పని పాటల కబుర్లాడి సమీక్షలో పాల్గొని,

స్వచ్ఛ కార్యకర్త ‘ఇనుపకుతిక రాజు’ పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” నినాదానికి  జై కొట్టారు.

ఐర్లాండ్ దేశంలో ఉంటున్న మన చల్లపల్లి నివాసి యువకుడు “సాత్విక్ మురారి” ప్రత్యక్షంగా పాల్గొని, స్వచ్ఛ చల్లపల్లి సేవలను కొనియాడారు.

డాక్టరు గార్ల దంపతుల కుమార్తె ‘స్నేహ’ గారు మాట్లాడుతూ మీరు చేస్తున్న ఈ స్వచ్ఛ కార్యక్రమంలో నేను వచ్చినపుడు పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళా కార్యకర్తలు వారివారి బాధ్యతలు చూసుకుంటూ ఇంతకాలం దీనిలో పాల్గొనడం మాత్రం చాలా గొప్ప విషయం అన్నారు.

రేపు కలవవలసిన ప్రదేశం హైవే రోడ్ లోని కాసానగర్ జంక్షన్ సమీపంలో ఉన్న కారం మిల్లు వద్ద అనుకుని గ్రామ సేవలో తరించి అందరూ గుప్పెడు సంతోషాన్ని మూట కట్టుకుని ఇంటి బాట పట్టారు.

- నందేటి శ్రీనివాస్

ప్రజా కళాకారుడు

04.10.2025.

ముక్త్యాలా! హే ముక్త్యాలా! 2

ఓ ముక్త్యాలా! ముక్త్యాలా! నీ స్వచ్చ శుభ్రతలు క్షేమమా?

హరిత శుభ్రతా విలాసాలతో నీ ఆహ్లాదం యదార్థమా?

శత దినాలుగా కార్యకర్తల శ్రమోద్యమం నీ సంతసమా?

స్వార్ధం తెలియని - కులమత మెరుగని కార్యకర్తలే నీ బలమా?

- నల్లూరి రామారావు

ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

04.10.2025