పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?
5.10.2025 ఆదివారం 3612* వ రోజు నాటి స్వచ్చ శ్రమ యజ్ఞం !
ఈ రోజు తెల్లవారు జామున 4.21 ని.లకు జాతీయ రహదారిపై కాసానగర జంక్షన్ సమీపంలో కారం మిల్లుకు దగ్గరలో కార్యకర్తలు చేరుకొని దారికి రెండు ప్రక్కలా ఉన్న మొక్కలను పరిరక్షించే పనిలో నిమగ్నమయ్యారు.
హైవేకు కుడి ప్రక్కన కాసానగర వైపు గద్దగోరు, సువర్ణ గన్నేరు మొక్కలలో ఉన్న కలుపు, గడ్డిని కత్తులతో తీసివేసి పరిశుభ్ర పరచారు. దారికి క్రింద వైపు ఉన్న పెద్ద మొక్కల చుట్టూ ఉన్న గడ్డిని తొలగించారు.
లోడింగ్ చేసే కార్యకర్తలు నిన్న చేయగా మిగిలిన ఈ రోజు చేస్తున్న పనికి వచ్చిన తుక్కును ట్రాక్టర్ లో లోడ్ చేసి తరలించారు. మిషన్ తో పని మాత్రం ప్రతి రోజూ రహదారి మార్జిన్ లు కట్ చేస్తూ ఉండవలసిందే.
41 మంది కార్యకర్తలు 6 గం.ల సమయం వరకూ పని చేసి రథసారథి వారు విజిల్ మ్రోగగానే పనికి విరామ మిచ్చి కాఫీ సేవించిన పిదప సమీక్షలో పాల్గొన్నారు. స్వచ్చ కార్యకర్త అర్జున రావు గారు (Rtd. ఉపాధ్యాయులు) ఈ రోజు మరణించిన విషయాన్ని తెలుసుకుని 2 నిముషాలు మౌనం పాటించి సంతాపం తెలియ చేయడం జరిగింది.
నిన్న జిల్లా కలెక్టర్ గారు రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ గా డాక్టరు గారిని నియమించిన విషయాన్ని వారు అందరికీ తెలియచేస్తూ ఇది స్వచ్చ చల్లపల్లి ఉద్యమానికి దక్కిన గౌరవం మాత్రమేనని అందరికీ చెప్పారు.
ప్రాతూరి శాస్త్రి గారు స్వచ్చ చల్లపల్లి అభివృద్ధికి 5000/- విరాళాన్ని చెక్కు ద్వారా మనకోసం మనం ట్రస్టుకు అందించారు.
గురవయ్య మాష్టారి గారి నీతి సూక్తులు విని రేపు కలవవలసిన ప్రదేశం కాసానగర్ జంక్షన్ సమీపంలో అనుకుని నిష్క్రమించారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
05.10.2025.
నెలల తరబడీ రహదారి సేవనలు! (NH216 @ Months together!)
చల్లని వేకువ సమయము లందున - నిలువున తడిపే వర్షము లందున
ఒక మారూళ్లో - ఒక పరి వెలుపల ఎగుడు దిగుడులో- ముళ్ల పొదలలో
చెమట ఖరీదులు విలువలు చూడక – ఏ పనికెంతని లెక్కలు కట్టక
గడ్డి చెక్కితిరి, వాలు పూడ్చితిరి - రోడ్ల గుంటలను సరిజేసితిరి!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
05.10.2025