పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?
06.10.2025 సోమవారం 3613* వ రోజు నాటి స్వచ్ఛ శ్రమదాన కార్యక్రమాలు!
తెల్లవారుజామున 4.22 నిమిషాలకు హైవే రోడ్ లో కాసానగర్ జాతీయ రహదారిపై కాసానగర్ జంక్షన్ వద్ద కార్యకర్తలు ముందుగా అనుకున్న ప్రకారం పనిముట్లు చేతబట్టి కాసానగర్ మలుపు వద్ద నుండి బాగు చేయడం మొదలుపెట్టారు.
దట్టంగా పెరిగిన మాచర్ల కంపను మళ్ళీ మళ్ళీ రాకుండా వేర్లతో సహా పీకే ప్రయత్నం చేశారు. చల్లపల్లి నుండీ హైవే కు ఎక్కబోయే మలుపులో కోతకు గురైన మార్జిన్ ను కొద్ది రోజుల క్రితం కార్యకర్తలు బాదులు, పెగ్గులు పాతి చాలా భాగం సరిచేసారు. ఈరోజు దానిపై కలుపు మొక్కలను ఏరివేయడం జరిగింది.
చెక్ పోస్టు వంతెన వరకు ఉన్న సువర్ణ గన్నేరు మొక్కల చుట్టూ ఉన్న కలుపును ఏరివేసి, రోడ్డు క్రింది భాగం వరకూ పూర్తిగా శుభ్రం చేశారు. కొంతమంది కార్యకర్తలు చెత్తను లోడ్ చెయ్యడం, ఆ వెనుక మహిళా కార్యకర్తలు ఊడ్చి శుభ్రం చెయ్యడం జరిగింది.
రహదారి మార్జిన్ లో గడ్డిని మిషన్ తోనే కార్యకర్త కట్ చేస్తూ ఉండడం వలన హైవే దారిలో రెండు ప్రక్కలా ఉన్న మొక్కలు కంటికి నిండుగా పూలతో దర్శనమిస్తున్నాయి.
6 గం.ల వరకూ పని చేసిన కార్యకర్తలు విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి కాఫీ సేవించిన పిదప సమీక్షలో పాల్గొని,
సర్పంచ్ ‘పైడిపాముల కృష్ణకుమారి’ గారు పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” కి జై కొట్టి,
పంచాయతీ కార్యదర్శి మాధవేంద్రరావు గారు మాట్లాడుతూ స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తల అవిరళ కృషి వల్ల ఈరోజు పంచాయతీ రాష్ట్ర స్థాయిలో5 అవార్డులను అందుకుంటుందని కార్యకర్తలకు చెప్పి కృతజ్ఞతలు తెలిపారు.
రేపు కలవవలసిన ప్రదేశం ఈ కాసానగర్ జంక్షన్ వద్ద అనుకుని నిష్క్రమించారు.
చల్లపల్లి వాస్తవ్యులు, ప్రభుత్వాసుపత్రి డైరెక్టర్ వరదా హరిగోపాల్ గారు వారి తండ్రి గారైన “వరదా రామారావు గారి” 6 వ వర్ధంతి సందర్భంగా ‘మనకోసం మనం’ ట్రస్టుకు 10,000/- రూపాయల చెక్కును మేనేజింగ్ ట్రస్టీ గారికి అందజేశారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
06.10.2025.
ముక్త్యాలా! హే ముక్త్యాలా! – 3
‘ముక్త్యాలా! హే ముక్త్యాలా! నీ ఘనతకు సాక్ష్యం అవసరమా?
వందరోజుల శ్రమదానం అభివందనీయమని చాటేలా –
భావితరాల బంగరు భవితకు పర్యావరణ మిగిల్చేలా –
గ్రామ సమగ్ర స్వచ్ఛ సంస్కృతికి కార్యకర్తలే సాక్ష్యాలా?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
06.10.2025