పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?
ది. 07.10.2025 – మంగళవారం, 3614* వ నాటి విశేషాలు!
వేకువ 4.19 నిమిషాలకు NH 216 లోని కాసానగర్ జంక్షన్ వద్ద కలుసుకుని శ్రమదానానికి కంకణం కట్టుకుని ఇద్దరు ముగ్గురు చొప్పున గ్రూపులుగా ఏర్పడి ఎవరు ఏ పని చేయగలరో ఆ ప్రదేశాన్ని ఎంచుకుని పనిముట్లు చేతబట్టి కార్యోన్ముఖులయ్యారు.
కొంతమంది కార్యకర్తలు రోడ్డు మార్జిన్ లో పెరిగిన పిచ్చి చెట్లను, చెత్తను తొలగించారు.
మరికొంతమంది కాసానగర్ జంక్షన్ వద్ద డివైడర్లలో గతంలో పెట్టిన మొక్కల మధ్య పెరిగిన కలుపును, పిచ్చి గడ్డిని, చెత్తను తొలగించారు.
ఇంకొంతమంది కార్యకర్తలు గత వారం రోజుల నుండి ప్రోగేసిన చెత్త గుట్టలను ట్రాక్టర్ లో లోడింగ్ చేసుకుని హైవే లో రోడ్డు కోతకు గురౌతున్న ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ అన్ లోడింగ్ చేశారు.
ఒక కార్యకర్త మాత్రం గడ్డి కోత మిషన్ తో రోడ్డు ప్రక్కల ఏపుగా పెరిగిన గడ్డిని సమానంగా కత్తిరించడం వెనుక ఒక మహిళా కార్యకర్త ఆ గడ్డిని ప్రోగులు పెట్టడం షరామామూలే.
6 గం.ల వరకూ పని చేసిన 24 మంది స్వచ్ఛ సేవకులు విజిల్ మ్రోతకు నేటి శ్రమదానానికి సెలవిచ్చి, కాఫీ సేవించిన తర్వాత సమీక్షా సమావేశంలో పాల్గొని,
‘కోడూరు వెంకటేశ్వరరావు’ గారు పలికించిన నినాదాలను పలికి,
నిన్న మచిలీపట్నం, విజయవాడ లో జరిగిన స్వచ్ఛ ఆంద్ర ఆవార్డుల విశేషాలను తెలుసుకుని,
రేపు కలవవలసిన ప్రదేశం ఇదే కాసానగర్ జంక్షన్ వద్ద అనుకుని గృహోన్ముఖులయ్యారు.
- దాసరి రామకృష్ణ ప్రసాదు
07.10.2025.
అంజలి - స్మృత్యంజలి! - 1
స్వచ్చోద్యమం తొలి దినాలందున ఉరవడిగ సైకిలిని త్రొక్కుచు
పద్యములు గొంతెత్తిపాడుచు పారిశుద్ధ్యం నిర్వహించుచు
సర్వవిధముల సహచరించిన చతురుడూ, ఉత్సాహవంతుడు
దివంగత వేమూరి అర్జున దివ్యస్మృతులకు అంజలించెద!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
07.10.2025