3616* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

09.10.2025  గురువారం 3616* వ నాటి స్వచ్ఛ సేవల వివరములు!

జాతీయ రహదారిపై కాసానగర్ జంక్షన్ వద్దకు కార్యకర్తలు 4:17 నిమిషాలకు చేరుకున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం జంక్షన్ మధ్యలోని డివైడర్ల మొక్కలలో బాగుచేసే పని అనుకుని అందరూ సిద్ధమయ్యారు.

డివైడర్లలోని ఒక భాగంలో ఉన్న టెంపుల్ గన్నేరు మొక్కలలో నిన్న కలుపు తీసిన భాగాన్ని నక్కులతో తిరగవేసి, ముళ్ళ కంప సరిచేసి కట్టారు. మరికొందరు డివైడర్ రెండవ భాగంలో దట్టంగా పెరిగిన కలుపును ఏరివేసే పనిలో నిమగ్నమయ్యారు.

కొంతమంది కాసానగర్ కు అవతలి వైపు రహదారి మార్జిన్ లోని పిచ్చి మొక్కలను, కలుపును తీసి శుభ్రం చెయ్యగా మహిళా కార్యకర్తలు చీపుళ్ళతో శుభ్రం చేశారు. నలుగురు కార్యకర్తలు చెక్ పోస్టు సమీపంలో రహదారి మార్జిన్ లో ఇబ్బడి ముబ్బడిగా మొలిచిన మాచర్ల కంపను తొలగించారు.

జరిగిన పనికి సంబందించిన తుక్కును లోడింగ్ చేసే పనిలో ఎప్పటికప్పుడు ట్రాక్టర్ లో లోడ్ చేస్తున్నారు.

6 గం.ల వరకు విశ్రమించని కార్యకర్తలు విజిల్ మ్రోగగానే  పనికి విరామమిచ్చి, కాఫీ సేవించిన పిదప సమీక్షలో “పాగోలు ప్రశాంతి” పలికిన ‘జై స్వచ్ఛ సుందర చల్లపల్లి’ నినాదానికి జై కొట్టారు.

సీనియర్ స్వచ్ఛ కార్యకర్త డా. మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారు చల్లపల్లి అభివృద్ధికి ప్రతి నెలా ఇచ్చే 2,000/- రూపాయల చెక్కును “మనకోసం మనం” ట్రస్టుకు అందజేశారు.

రేపు కలవవలసిన ప్రదేశం ఈ కాసానగర జంక్షన్ వద్ద అనుకుని తిరుగుపయనమయ్యారు.

- నందేటి శ్రీనివాసరావు

    09.10.2025.

అంజలి - స్మృత్యంజలి! – 3

ధవళజుబ్బా ధవళధోవతి - అచ్చమైన తెనుగు ఆకృతి

జుట్టు మొదలాపాద మస్తక స్వచ్ఛ సుందర ధవళ ధీధృతి

తెలుగు, హిందీ, తమిళ మాటల తియ్యనైన వాక్ చమత్కృతి -

అతడు మన వేమూరి అర్జును డంజలిద్దాం అతని స్మృతికి!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   09.10.2025