3617* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

10.10.2025 శుక్రవారం 3617* వ రోజు నాటి స్వచ్ఛ సేవా విశేషాలు!

ఈరోజు తెల్లవారుజామున 4:18 నిమిషాలకు జాతీయ రహదారిపై కాసానగర్ జంక్షన్ వద్ద కార్యకర్తలు కార్యోన్ముఖులయ్యారు. హైవే మధ్యలో ఉన్న డివైడర్లలో అంతకుముందు గైనకాలజి వైద్యుల బృందం నాటిన గుడి గన్నేరు, గన్నేరు, సువర్ణ గన్నేరు, టెకోమారెడ్ మొక్కల పరిరక్షణలో కార్యకర్తలు నిమగ్నమయ్యారు.

కాసానగర్ జంక్షన్ లో ఉన్న డివైడర్లలో గుడి గన్నేరు మొక్కల మధ్యలో ఉన్న కలుపు గడ్డిని తొలగించినారు. ఇద్దరు కార్యకర్తలు, ఒక మహిళా కార్యకర్త కలుపు వెంటనే రాకుండా ఉండడం కోసం నక్కులతో మట్టిని తిరగదీసినారు.

మిగతా కార్యకర్తలు మొక్కల మధ్య ఉన్న కలుపును పూర్తిగా లాగివేసి శుభ్రపరిచినారు. డివైడర్ల మధ్యలో ఉన్న మొక్కలు మాత్రం పచ్చగా మొగ్గ తొడిగి చూపరులకు కనువిందు చేస్తున్నాయి.

మరొక బృందం కార్యకర్తలు జాతీయ రహదారి ప్రక్కనే వేసిన మరుగుదొడ్డి నూతి వర్రల వ్యర్థాలను అతికష్టం మీద తీసివేసి శుభ్రపరచినారు. ఈ క్రమంలో ఒక కార్యకర్త రెండు కాళ్ల మధ్యగా వెళ్లిన కట్లపామును చూసి జాగ్రత్తగా తప్పుకోవడం కొసమెరుపు.

మరొక కార్యకర్తల సమూహం చల్లపల్లి పొలిమేర చివరి వరకు అనగా పెదప్రోలు పంచాయితీ సరిహద్దు వరకు పిచ్చి మొక్కలు, గడ్డి, కంప లాగి పరిశుభ్రం చేసారు. దీంతో ఆ కాసానగర్ జంక్షన్ ప్రాంగణమంతా మొక్కలతో కళకళలాడుతూ ఉంది.

అలా 6 గంటల వరకు పనిచేసిన 24 మంది కార్యకర్తలు విజిల్ మ్రోగగానే కాఫీ సేవించి సమీక్షలో పాల్గొనని,

‘రాయపాటి రాధాకృష్ణ’ గారు పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లికి” జై కొట్టి,

రేపు కలవవలసిన ప్రదేశం ఈ కాసానగర్ జంక్షన్ వద్ద అనుకుని నిష్క్రమించారు.

- నందేటి శ్రీనివాసరావు

    10.10.2025.

అంజలి - స్మృత్యంజలి! – 4

దవణగిరియందున్నగానీ దినదినం స్వచ్చోద్యమంబున

స్వచ్ఛ సుందర కార్యకర్తకు ఫోను చేస్తూ - ప్రోత్సహిస్తూ

ప్రత్యూషమందే పలకరిస్తూ – పలవరిస్తూ - కలవరించే

అర్జునుల వారికి కార్యకర్తల అంజలీ - శ్రద్ధాంజలీ!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   10.10.2025