పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?
11.10.2025 శనివారం 3618* వ రోజు నాటి స్వచ్ఛ సేవా యజ్ఞం!
జాతీయ రహదారిపై కాసానగర్ జంక్షన్ వద్ద తెల్లవారుజాము 4.13 ని.లకు కార్యకర్తలు పనికి సిద్ధమయ్యారు. డివైడర్ల మధ్యలో ఉన్న కలుపు మొక్కలను ఏరివేయడం, కర్రలు కట్టడం లాంటి పనులు చేయడం లో కార్యకర్తలు తలమునకలయ్యారు.
కాసానగర్ హైవే జంక్షన్ ప్రాంతం ఇపుడు ఎంతో అందంగా దర్శనమిస్తుంది. గత 5 రోజులుగా ఈ ప్రదేశం లోనే కార్యకర్తలు అనేక మంది పని చేస్తున్నారు.కొద్ది కాలం క్రితం పిచ్చి మొక్కలు, ఖాళీ లేకుండా గడ్డితో నిండిన డివైడర్లు ఇప్పుడు పూల మొక్కలతో పచ్చదనం నిండి ఉన్నాయి. ఇదంతా స్వచ్చ కార్యకర్తల శ్రమ ఫలితమే.
మరికొద్ది మంది కార్యకర్తలు రహదారి దిగువ భాగంలో మొక్కల మధ్యలో ఉన్న గడ్డిని, పిచ్చి మొక్కలను తొలగించారు. మొక్కలు గాలికి వంగిపోయి పడిపోకుండా కర్రలు పాతడం చేశారు.
కొంతమంది కార్యకర్తలు అక్కడక్కడా వంగిపోయిన నేరేడు, అలస్తేనియా మొక్కలను సరిచేసి కట్టారు. వాలిపోయిన అడ్డుగా ఉన్న అలస్తేనియా కొమ్మలను కొట్టడం జరిగింది. సచివాలయం సిబ్బంది కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొని చీపుళ్ళతో శుభ్రం చేశారు.
6 గం.ల వరకు విశ్రమించని కార్యకర్తల బృందం విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి కాఫీ సేవించిన పిదప సమీక్షలో పాల్గొన్నారు. సర్పంచ్ కృష్ణ కుమారి గారు జై స్వచ్చ సుందర చల్లపల్లి నినాదాలు చెప్పగా అంతా గొంతు కలిపారు.
సర్పంచ్ కృష్ణ కుమారి గారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి వచ్చిన ఈ స్వచ్చ భారత్ పురస్కారం ఊరి కొరకు నిస్వార్థంగా శ్రమిస్తున్న స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలకే చెందుతుందని తెలిపారు.
సోమవారం సాయంత్రం చల్లపల్లి మండల పరిషత్ కార్యాలయంలో కలెక్టరు గారితో జరిగే సమావేశానికి అందరు కార్యకర్తలు తప్పని సరిగా హాజరు కావాలని కోరారు. ఈ రోజు స్వచ్చ సేవలో ప్రత్యక్షంగా పాల్గొన్న పంచాయతీ సచివాలయ సిబ్బందిని డాక్టరు గారు అభినందించారు.
రేపు కలవవలసిన ప్రాంతం ఈ కాసానగర్ జంక్షన్ ప్రదేశమే అనుకుని నిష్క్రమించారు.
- నందేటి శ్రీనివాసరావు
11.10.2025.
అంజలి - స్మృత్యంజలి! – 5
అతని ఉత్సాహమును చూచిన - అతని వాత్సల్యమును పొందిన –
అతని నుండీ స్ఫూర్తి పొందిన - ప్రతి దినం చరవాణిలోతడ
బడే గొంతుకను వింటూ వెంట వెంటనె బదులు పలికిన
కార్యకర్తలు అతని స్మృతి చిరకాలమూ గుర్తుంచుకొందురు!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
11.10.2025