3619* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

12.10.2025 ఆదివారం 3619* వ రోజు నాటి శ్రమదాన సంగతులు! 

ఈ రోజు ఉదయం 4.17 గం.ల సమయానికి జాతీయ రహదారిపై కాసానగర్ జంక్షన్ వద్దకు కార్యకర్తలు చేరుకున్నారు. తమ తమ పనిముట్లు చేతబట్టి పని చేయనారంభించారు. ఆ జంక్షన్ ప్రాంతమంతా అత్యంత పరిశుభ్రంగా చీపుళ్ళ తో ఊడ్చి వేశారు.  

రహదారికి కుడి, ఎడమ వైపున మాచర్ల కంపను కార్యకర్తలు లాగి వేయగా గడ్డిని పిచ్చి మొక్కలను కార్యకర్త గడ్డి కటింగ్ మిషన్ తో కట్ చెయ్యడం జరిగింది. హైవే లోని కాసానగర్ జంక్షన్ నుండి రామానగరం క్లబ్ రోడ్డు వరకు రెండు ప్రక్కల రహదారి మార్జిన్ లు కటింగ్ మిషన్ తో కట్ చెయ్యడం వలన చూడడానికి హైవే ఎంతో అందంగా తయారయింది. (ఈ చల్లపల్లి పొడవునా) 

కొద్ది మంది కార్యకర్తలు రహదారి మార్జిన్ దిగువన పెద్ద మొక్కల చుట్టూ ఉన్న గడ్డిని కత్తులతో బాగుచేసి శుభ్రపరిచారు. ఇంకా కొన్ని మిగిలి ఉన్న మొక్కలకు కర్ర కట్టి ఎలాంటి గాలుల నుండైనా రక్షణ కల్పించారు.

6 గం.ల వరకు విరామమెరుగని కార్యకర్తలు కాఫీ సేవించిన పిదప జరిగిన సమీక్షలో పాల్గొన్నారు. ఇంత దూరం ఆ సమయంలో వచ్చి ఇంత సమయం వారిది కాని ప్రదేశంలో పని చేయడం నిజంగా చాల గొప్ప విషయం అని డాక్టరు గారు అన్నారు. రేపు సాయంత్రం 3 గం.లకు జరగవలసిన M.L.A బుద్ధ ప్రసాద్  గారి ఆధ్వర్యంలో  సమావేశమునకు అందరూ హాజరు కావాలని సర్పంచ్ కృష్ణ కుమారి గారు మాట్లాడిన అనంతరం కోడూరి వెంకటేశ్వర రావు గారు ప్రతి నెలా ఇచ్చే 520/- ల విరాళాన్ని మనకోసం మనం ట్రస్టుకు అందించారు.

గురవయ్య మాష్టారు చెప్పిన నీతి సూక్తులు విని అందరూ స్వచ్చ కార్యకర్తలు శ్రమ ఫలితంగా ఆవిష్కరించబడిన హైవే లోని పూల అందాలను ఆస్వాదిస్తూ ఇంటి బాట పట్టారు.    

- నందేటి శ్రీనివాసరావు

    12.10.2025.

నెలల తరబడీ రహదారి సేవనలు! (NH216 @ Months together!)

చల్లని వేకువ సమయము లందున - నిలువున తడిపే వర్షము లందున

ఒక మారూళ్లో - ఒక పరి వెలుపల ఎగుడు దిగుడులో- ముళ్ల పొదలలో

చెమట ఖరీదులు విలువలు చూడక – ఏ పనికెంతని లెక్కలు కట్టక

గడ్డి చెక్కితిరి, వాలు పూడ్చితిరి - రోడ్ల గుంటలను సరిజేసితిరి!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   12.10.2025