3621* వ రోజు ....

పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

14.10.2025 మంగళవారం 3621* వ రోజు నాటి స్వచ్ఛ శ్రమదాన చల్లపల్లి శ్రమదాన విశేషాలు!

జాతీయ రహదారిపై  కాసానగర్ జంక్షన్ వద్ద తెల్లవారుజాము 4:20 నిమిషాలకు స్వచ్ఛ కార్యకర్తలు ఒకచోటుకి చేరి మొదటి ఫోటో దిగి అనంతరం పని ప్రారంభించారు.

కారుమబ్బులు కమ్మి వర్షం వచ్చే పరిస్థితిలో వాతావరణం ఉన్నా మా సంకల్పాన్ని ఎవరూ ఆపలేరంటూ స్వచ్ఛ కార్యకర్తలు సమయానికి పని ప్రదేశానికి చేరుకోవడం గమనార్హం.

సుమారు 140 రోజులుగా జాతీయ రహదారి వెంట మొక్కల పరిరక్షణ చర్యలలో భాగంగా చేపట్టిన “గ్రీన్ ఆపరేషన్” ఈరోజు ముగిసింది. గత 2 సంవత్సరాలుగా జాతీయ రహదారికి ఇరువైపులా కార్యకర్తలు నాటి బ్రతికించిన 1800 మొక్కల రక్షణ కోసం కార్యకర్తలు పడిన కష్టం అసాధారణమైనది. వాటికి పాదులు చేసి కంప కట్టి నిటారుగా ఉండుటకు కర్రకట్టి నీరుపోసి కలుపు తీసి మొదళ్లకు మట్టి వేసి ఇలా అనేక దశలవారీగా కన్న బిడ్డల వలె మొక్కలను పెంచిన తీరు వర్ణనాతీతం.

క్లబ్ రోడ్ నుండి కాసానగర్ జంక్షన్ వరకు జాతీయ రహదారిపై చల్లపల్లి పొలిమేర హద్దుల వరకు ఒకసారి పరిశీలిస్తే రెండు ప్రక్కల పచ్చని చెట్లు పూల పరిమళాలు వెదజల్లే పూల మొక్కలు గన్నేరు, సువర్ణ గన్నేరు, గుడి గన్నేరు, టెకోమా రెడ్, ఢిల్లీ కనకాంబరం, పారిజాతం, నూరు వరహాలు ఇలా రకరకాల పూల మొక్కలు చూపరులను కట్టిపడేస్తున్నాయంటే స్వచ్ఛ  కార్యకర్తల స్వేద జలంతో తడిసి పునీతమైన హైవేలోని ఈ చల్లపల్లి ప్రాంతం ఎంత చూసినా తనివి తీరదు.

కొద్దిమంది కార్యకర్తలు నిన్న మిగిలిన రహదారి దిగువ భాగం కలుపు తీసి శుభ్రం చెయ్యగా మరొక ఇద్దరు కార్యకర్తలు మొక్కలు వంగిపోకుండా కర్రలు పాతి నిటారుగా ఉండేలా చూడడం మరికొందరు తుక్కును గంపలకెత్తి  ట్రాక్టర్ లో లోడ్ చెయ్యడం మరొకరు కటింగ్ మిషన్ తో మార్జిన్ లో గడ్డిని కత్తిరించడం, ఇలా ఎవరి పని వారిదే అయినా సరే అందరి సంకల్పం మాత్రం స్వచ్ఛ సుందర చల్లపల్లే.
6 గం.ల వరకూ శ్రమించిన వీరు విజిల్ మ్రోగినంక కొద్ది నిముషాలు చెమట తడి

ఆరే వరకూ కాఫీ ముచ్చట్లాడుకుని తదుపరి సమీక్షలో పాల్గొని,

   

ఆసుపత్రి సిబ్బందిలో ఒకరైన ‘బత్తుల రవి’  “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” అని పలకగా అంతా గొంతు కలిపి జై కొట్టారు.

సర్పంచ్ కృష్ణకుమారి గారు నిన్న జరిగిన సభకు హాజరైనందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

ఎంత కష్టమైన మీ వెలకట్ట లేని శ్రమ ద్వారా హైవే పై అందరూ 4 నెలల రెక్కల కష్టంతో అద్భుతమైన అందాలు ఆవిష్కరించారని డాక్టరు గారు కొనియాడారు.

రేపు కలవవలసిన ప్రదేశం నాగాయలంకరోడ్ లోని కాసానగర్ చెరువు వద్ద అనుకుని నిష్క్రమించారు.   

- నందేటి శ్రీనివాసరావు

    14.10.2025.

నెలల తరబడీ రహదారి సేవనలు! (NH216 @ Months together!)- 4

చల్లపల్లి శ్రమదాన ప్రశస్తత సరిగా గ్రహింపజాలరు కొందరు

చెంతను గులాబి ఉన్న వరకు ఆ సౌరభమాఘ్రాణించ కుందురు

సౌకుమార్యమును మన్నన చేయరు విలువను సైతం సరకు చేయరు

అది దూరముగా జరిగినప్పుడే ఆ లోటేమిటొ అనుభవించెదరు!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   14.10.2025