3622* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

15.10.2025 బుధవారం 3622* వ రోజు నాటి స్వచ్ఛ శ్రమ సేవా యజ్ఞం!

ఈరోజు ఉదయం కాసానగర్ నుండి చల్లపల్లి వైపు వెళ్ళే రహదారి మొదట్లో చెరువు దగ్గరకు తెల్లవారుజాము 4:19 నిమిషాలకు కార్యకర్తలు చేరుకున్నారు. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం చెరువు దగ్గర నుండి పని మొదలుపెట్టడానికి కార్యకర్తలు కొడవళ్ళు, గొర్రులు, కత్తులతో సిద్ధమవగా రహదారి అంచు నుండి చెరువు వరకు రోడ్డు పూర్తిగా కోతకు గురై ప్రమాదాలకు సెలవుగా ఉంది.

అందుకు గాను కార్యకర్తలు రహదారికి అవతలి వైపు ఉన్న బెంబేడు చెట్ల కొమ్మలు, రహదారి దిగువ భాగం బాగుచెయ్యగా వచ్చిన పిచ్చి మొక్కలు, తుక్కును ప్రాధమిక చర్యలలో భాగంగా ఆ గోతిలో వెయ్యడం జరిగింది. అది ఎంతో కాలంగా అపరిశుభ్రంగా ఉన్న సమస్య అయినా ఆ కాలనీ వాసులకు పట్టకపోవడం విచారకం.

36 మంది కార్యకర్తలు ఆ రోడ్డు మొదట్నుంచి చెరువు వరకూ ఎంతో గబ్బు పట్టి ఉన్న రహదారి మార్జిన్ ను వారి శ్రమతో పరిశుభ్రపరిచారు. వేకువ జాము నుండి RTC బస్సులు, పైవేటు వాహనాలు వివిధ ద్విచక్ర వాహనాలు తిరుగుతూ ఉన్న కార్యకర్తలు వారిని వారు జాగ్రత్తగా చూసి నడుచుకుంటూ ఈ సమాజంలో ఎందరినో దుర్గంధం నుండి కాపాడే పనిని బుజస్కందాలకెత్తుకున్నారు.

కార్యకర్తలు కొమ్మలు నరికిన తదుపరి మహిళా కార్యకర్తలు గొర్రులతో పోగు చెయ్యడం చీపుళ్ళతో శుభ్రపరచడం జరిగింది. దాదాపు ఒక గంటన్నర పాటు కార్యకర్తలు పని చేయడంతో ఆ ప్రాంతమంతా సేదతీరదగిన ఓ చల్లని ప్రదేశంగా తయారయ్యింది.

6 గంటల వరకూ పని చేసిన తరువాత విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి,

ఆసుపత్రి సిబ్బంది అయిన ‘శారద’ గారు పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” జై కొట్టి,

రేపు కలవవలసిన ప్రదేశం నాగాయలంక రోడ్ లోని అమరస్థూపం వద్ద అనుకుని నిష్క్రమించారు.

- నందేటి శ్రీనివాసరావు

    15.10.2025.

నెలల తరబడీ రహదారి సేవనలు! (NH216 @ Months together!)- 5

ఉషోదయమునకు చాల ముందుగా ఊరి బైట - జాతీయమార్గమున

ప్రజాసౌకర్య పరికల్పనకై స్వార్ధరహిత శ్రమదాన వైభవము

నెలల తరబడీ కార్యక్రమమున నిండు మనసుతో పాల్గొన్నప్పటి

భానూదయ సౌందర్య వీక్షణము - ప్రకృతి విలాసము - ఎంత దృష్టమొ!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   15.10.2025