పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?
16.10.2025 గురువారం 3623* వ రోజు నాటి స్వచ్ఛ శ్రమదాన సారంశము!
ఈరోజు నాగాయలంక రోడ్ లోని అమరస్ధూపం వద్ద తెల్లవారుజాము 4:20 నిమిషాలకు కార్యకర్తలు గ్రూప్ ఫొటో దిగి అనంతరం పనికి సిద్ధమయ్యారు. ఆ రోడ్ లో కాసానగర్ చెరువు దగ్గర నుండి అమరస్ధూపం వరకు నిన్న చేసిన పని తాలూకు చెత్త వ్యర్ధాలను ఈరోజు ఎక్కువమంది కార్యకర్తలు ట్రాక్టర్ లో లోడ్ చెయ్యడానికే సరిపోయారు.
కార్యకర్తలు నరికిన కొమ్మలను కొద్ది దూరంలో ఉన్న కాసానగర్ చెరువు కోతకు గురైన ప్రదేశంలో వేసి ఆ మార్జిన్ గుంటను కొమ్మలు రెమ్మలూ తుక్కు వేసి మార్జిన్ కొంత మెరక చేసినట్లయింది. మహిళా కార్యకర్తలు రహదారి మార్జిన్ శ్రమకోర్చి దూరంగా ఉన్న చెరువు వద్దకు కొమ్మలను లాక్కెళ్ళడం అక్కడున్న సైనికులు వాటిని కోతకు గురైన ప్రాంతంలో వేసి తొక్కడం జరిగింది.
ఆ కాలనీవాసుల అవసరాలు తీర్చే ఆ చెరువు అంత దారుణంగా రహదారి మార్జిన్ కొట్టుకుని పోతుంటే ఆ పనిని అక్కడకు వెళ్లి స్వచ్ఛ సైనికులు పనిచేస్తుంటే ఒక్కరంటె ఒక్కరు కూడా మీతో మేము కూడా పనిచేస్తాము అని అనకపోవడం విడ్డూరం గాను, బాధగానూ ఉంది.
మరొక ముగ్గురు కార్యకర్తలు చారిత్రాత్మక ఉద్యమ చిహ్నమైన అమరస్ధూపం ముందు ఉన్న గార్డెన్ శుభ్రం చేశారు. మరికొంతమంది కార్యకర్తలు ఆ మార్జిన్ కు క్రింది భాగంలోని కలుపు శుభ్రం చేశారు. ఇప్పుడు ఆ పని చేసిన ప్రాంతం చూస్తే పచ్చని చెట్లు రెండు ప్రక్కలా గొడుగు పట్టినట్లు ఎంతో చల్లదనంగా మరో ఊటీని తలపిస్తుంది.
అలా 6 గంటల వరకూ పని చేసిన 26 మంది కార్యకర్తల బృందం విజిల్ మ్రోగగానే పనిని విరమించి జరిగిన పని ప్రదేశాన్ని వెనుదిరిగి ఒక్కసారి చూచుకుని సంతోషంగా కాఫీ సేవిస్తూ కబుర్లు ఆలకిస్తూ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
శివారమపురం వాస్తవ్యుడు అయోధ్య వెంకటేశ్వరరావు తన చిన్న కుమారుని వివాహానికి కార్యకర్తలందరినీ ఆహ్వానించారు.
షణ్ముఖ శ్రీనివాస్ గారు పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” నినాదానికి జై కొట్టి,
రేపు కలవవలసిన ప్రాంతం నాగాయలంక రోడ్ లోని ఈ అమరస్థూపం వద్ద అనుకుని నిష్క్రమించారు.
- నందేటి శ్రీనివాసరావు
16.10.2025.
నెలల తరబడీ రహదారి సేవనలు! (NH216 @ Months together!)- 6
దుమ్ముమేనులను క్రమ్ముకొనుచుండ - బురద బట్టలకు మరకలు పెట్టగ
చెమట సుగంధము చుట్టు ముట్టగా - చంద్రుడొ సూర్యుడొ సాక్షిగ వెలుగగ
ప్రజాహ్లాదమే ఒక తపస్సుగా స్వచ్ఛ శుభ్రతా సమీకరణములు!
ఇదే కదా జీవన సౌందర్యము? ఇవి కావా సత్కళకు ప్రేరణలు?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
16.10.2025