3626* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

19.10.2025 ఆదివారం – 3626* వ రోజు నాటి స్వచ్ఛ శ్రమ ఘట్టాలు!

               నాగాయలంక రోడ్ లోని అమరస్థూపం వద్దకు తెల్లవారుజాము 4:26 నిమిషాలకే కార్యకర్తలు చేరుకున్నారు. మొదటి ఫొటో దిగిన తదుపరి వారి వారి పనిముట్లు చేతబట్టి కార్యోన్ముఖులయ్యారు.

               అప్పటికే కారు మబ్బులు కమ్మి వర్షం కుమ్మరించడానికి సిద్ధమైన వాతావరణం నెమ్మదిగా వెనుకడుగు వేసి సన్నటి జల్లు ప్రారంభమయినది. అయినా స్వచ్ఛ కార్యకర్తలకు మాత్రం వారి పని వారిదే. నిన్న పని ముగించిన ప్రదేశం నుండి మొదలుపెట్టారు.

               ప్లాస్టిక్ కనిపించకుండా ఏరివేయడం లక్ష్యంగా ఇద్దరు మహిళా కార్యకర్తలు సమూలంగా ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ ను అంతమొందించే పని చేస్తున్నారు.  ఆ పనిలోనే కొద్ది మంది మహిళా కార్యకర్తలు, కార్యకర్తలు డిప్పలలో ప్లాస్టిక్ కవర్లు, గాజు సీసాలు, వాటర్ గ్లాసులు, వాడేసిన ప్లాస్టిక్ విస్తర్లు అన్నీ భూమిపై నుండి తీసివేస్తున్నారు.

               మరొక కార్యకర్త గడ్డి కటింగ్ యంత్రం చేతబట్టి సమానంగా గడ్డి కట్ చేస్తుండగా మరికొద్దిమంది కత్తులతో మిగిలిపోయిన కలుపు మొక్కలు చెత్తా అడ్డుపడే కొమ్మలు వీటన్నింటినీ తీసి శుభ్రం చేస్తున్నారు. అప్పటి వరకూ నిదానంగా కురిసిన జల్లుల వర్షం ఒక్కసారిగా పెరిగి కార్యకర్తలను తడిపి ముద్ద చేసింది.

 చలికి వణుకుతూ వేడి కాఫీ సేవించి సమీక్షలో పాల్గొన్నారు.

               అమరవీరుల స్థూపం ముందు నిలబడి గంభీరమైన గొంతుతో స్వచ్ఛ సుందర చల్లపల్లినిసాదిద్దామన్న కోడూరు వెంకటేశ్వరరావుగారి స్వరానికి గొంతు కలిపి సాదిద్దాం అంటూ,

               రేపు కలవవలసిన ప్రదేశం ఇదే అమరస్థూపం వద్ద అనుకుని గృహోన్ముఖులయ్యారు.

- నందేటి శ్రీనివాస్

   19.10.2025.

వ్యక్తి బాధ్యత ఊరిదైతే....

వ్యక్తి బాధ్యత ఊరిదైతే ఊరి బాధ్యత వ్యక్తులదె కద

ఊరు, పౌరులు వేరుకాదే - ఒకరి కొకరు సమాశ్రితులు గద

కావుననె ఈ కార్యకర్తలు గ్రామసేవకు దిగితిరి గదా

పౌరులెందుకు కలిసిరారో! బాధ్యతెందుకు పంచుకొనరో?

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   19.10.2025