పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!
20.10.2025 సోమవారం 3627* వ రోజు నాటి శ్రమదాన ఘట్టములు!
ఈరోజు తెల్లవారుజామున 4:19 నిమిషాలకు నాగాయలంక రోడ్డులోని అమరస్థూపం వద్ద ప్రణాళిక ప్రకారం కార్యకర్తలు చేరుకున్నారు. చేయవలసిన పనులను నిర్ధారించుకుని కావలసిన పనిముట్లతో పనికి సిద్ధమయ్యారు.
రహదారి ప్రక్కన వరులో నాటిన అడవి తంగేడు మొక్కలు నిన్నటి వరకు రంగురంగుల పూల అందాలతో అందరినీ ఆకర్షించి పూలు పూయడం పూర్తయినవి. వాటిని రోడ్డు మీదకి వచ్చిన కొమ్మలను కత్తిరించుకుంటూ, మొదలు కలుపు లేకుండా బాగు చేసుకుంటూ వంగిన వాటిని నిలబెట్టుకుంటూ కార్యకర్తలు చేస్తున్న మొక్కల పరిరక్షణా చర్యలు అసామాన్యం, అద్భుతం
చేసిన పనిని మళ్ళీ వెనుదిరిగి చేసుకుంటూ తుది మెరుగులు దిద్దుతూ ఎంతో పరిశుభ్రంగా తయారుచేస్తున్న కార్యకర్తల కష్టం అందరికీ అర్ధమయ్యేనా? గ్రామంలో నివశిస్తున్న 20 వేల మంది జనాభా యొక్క, శుభ్రత స్వచ్ఛత కోసం అంటువ్యాధులు లేని సమాజం కోసం, ఆహ్లాదకరమైన పర్యావరణం అందించడం కోసం 11 సంవత్సరాలుగా కేవలం ఊరిలో 30-40 మంది మాత్రమే పని చేయడం సాధారణ విషయంగానే అనిపిస్తుందా?
రోజూ 2 గంటల పాటు పదకొండేళ్ళుగా కొన్ని లక్షల గంటల శ్రమ చేస్తూ ఊరిని శుభ్రంగా స్వచ్చంగా సుందరంగా ఉంచుతుంటే ఈరోజు నాగాయలంక రోడ్ లో పని చేస్తుంటే అక్కడ ఉన్న అపరిశుభ్రతా దృశ్యాలు అత్యంత జుగుప్సాకరంగా ఉండడం ఏమిటి? 2015 లో చిల్లలవాగు సమీపంలో డంపింగ్ యార్డు, స్మశానవాటిక కోసంకొన్ని వందలమంది చేసే పనిలో మానవ కళేబరాలు, మానవ విసర్జితాలు, జంతు కళేబర వ్యర్ధాలు, మల మూత్ర విసర్జితాలు ఉన్నా కఠోరమైన దీక్షతో సర్వాంగ సుందరంగా ఆ ప్రదేశాలను తీర్చిదిద్దిన కార్యకర్తలకు 10 సంవత్సరాల తరువాత కూడా ఈ దారిలో వేసిన వ్యర్ధాలను చూస్తుంటే మనం ఏమి మారినట్లు?
“మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు – మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు” అని ప్రజాకవి అందెశ్రీ ముందే ఊహించి రాసినట్లుంది.
ఆ దారిలో కుప్పలుగా పోసిన వ్యర్ధాల గుట్టలు దుర్గంధం వెదజల్లుతుంటే ఒకరిద్దరు చేస్తున్న హేయమైన పనులకు అందం కోసం పనిచేస్తున్న ఈ స్వచ్చ కార్యకర్తలు మూల్యం చెల్లించుకోవాలా? స్వచ్ఛతతో, శుభ్రతలో స్వచ్చంద సేవలో దేశం చల్లపల్లి వైపు చూస్తుంటే చల్లపల్లిలో ఉన్న మనం మాత్రం మన ఇష్టమొచ్చినట్లు ఎక్కడపడితే అక్కడ ఎలా పడితే అలా చెత్త వేయడం ఎంతవరకు సబబు ఆలోచించండి. వారు ఎంచుకున్న లక్ష్య సాధన కోసం అవిశ్రాంతంగా పనిచేస్తూ చెత్తా చెదారాలను ఏరివేస్తున్నారు.
రహదారి మార్జిన్ ను మిషన్ తో అందంగా కట్ చేస్తున్నారు.
6 గంటల సమయం వరకు పనిచేస్తున్న కార్యకర్తలు విజిల్ మ్రోగగానే పని విరమించి ఆగిన ప్రదేశానికి చేరుకున్నారు. కాఫీ సేవిస్తూ చెమట తడిని ఆరనిచ్చి సమీక్షా సమావేశానికి నడిచారు.
‘జ్యోతి విజయరాణి’ పలికిన జై స్వచ్చ సుందర చల్లపల్లి నినాదానికి స్ఫూర్తివంతంగా జై కొట్టారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని వాడవద్దనే మన ప్రచారంలో భాగంగా ఒక స్వచ్చ కార్యకర్త ఫంక్షన్ లో ఉపయోగించడానికి 60 వేల రూపాయల విలువ గల 500 స్టీలు భోజనం ప్లేట్లు “మనకోసం మనం” ట్రస్టుకు బహుకరించారు. వారికి అందరం ధన్యవదాలు తెలిపి,
రేపు కలవవలసిన ప్రదేశం ఈ రోడ్ లోని అమరస్ధూపం వద్ద అనుకుని నిష్క్రమించారు.
- నందేటి శ్రీనివాస్
20.10.2025.
జయ-జయ-జయ-జయ!
జయనందన వన సమాన హైందవ శ్మశాన ధాత్రి!
జయ ఆర్.టి.సీ. ప్రాంగణ చకచ్చకిత వన క్రాంతి!
జయ సస్యామల శోభిత సుజాతీయ రహదారీ!
జయ బాహ్య గ్రామ అష్ట స్వచ్ఛ శుభ్ర రహదారీ!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
20.10.2025