పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?
21.10.25 మంగళవారం @3628* రోజు నాటి స్వచ్ఛ సేవల వివరములు!
ఈరోజు నాగాయలంక రోడ్ లోని అమరస్థూపం వద్ద తెల్లవారుజామున 4.20 నిమిషాలకు కార్యకర్తలందరూ కలుసుకొని స్వచ్ఛ సేవకు సమయాత్తమయ్యారు.
ఆ రోడ్ లో ఉన్న ధర్మోకోల్ కంపెనీ వద్ద నుండి చల్లపల్లి వైపు కుడి ప్రక్కన నిన్న బాగుచేయగా వచ్చిన చెత్తను లోడింగ్ చేయడానికి కొందరు కార్యకర్తలు వెళ్ళగా కంపెనీ ఎదురుగా ఎప్పటి నుండో అక్కడ పడవేసి ఉన్న ఎండు కొమ్మలు, ప్లాస్టిక్ కవర్లు, ధర్మోకోల్ బాక్సులు, చెత్తా చెదారాలు మొత్తం కార్యకర్తలు లాగి గుట్టలుగా వేసి ట్రాక్టర్ లో లోడ్ చేసి, ఆ ప్రాంతం ఎంతో శుభ్రంగా అందంగా తయారుచేసారు.
అక్కడి నుండి దారి పొడవునా ఉన్న ప్లాస్టిక్ వ్యర్ధాలు ఏరుకుంటూ అలాగే అడవి తంగేడు మొక్కలను అందంగా ఉండేలా సరిచేసుకుంటూ కార్యకర్తలు పని చేస్తున్నారు. అపరిశుభ్రమైన వాతావరణంతో “ముంచుకొస్తున్నాది అనారోగ్య గుండం – ముందుకొచ్చి ఆపండి అందరికీ దండం” అని కార్యకర్తలు పదేపదే చెబుతున్నా ఇంకా కొంతమంది జనం బైక్ ల పై నుండి వ్యర్ధాల మూటలను రోడ్డు ప్రక్క మార్జిన్ లోకి విసిరి వేసి వెళ్ళడం చూస్తుంటే వారిని గుర్తించి కఠోరమైన చర్యలు తీసుకోవలసిన అవసరం స్ధానిక పరిపాలనాధికారులకు ఉంది గదా?
ఈరోజు పని చెయ్యగా వచ్చిన చెత్త వ్యర్ధాలను మొత్తం లోడ్ చెయ్యడం అలాగే మిషన్ తో మార్జిన్ ను కట్ చెయ్యడం వంటి పనులతో వెనుక మొత్తం ఊడ్చుకుంటూ మహిళా కార్యకర్తలు ఆ ప్రాంతాన్ని స్వచ్ఛమయం చేయడం వెనుక ఎందరి చెమట చుక్కల శ్రమ దాగి ఉందో!
6 గంటల వరకు పనిచేసి విజిల్ మ్రోగగానే తదుపరి కాఫీ సేవించుటకు వచ్చి కాఫీ త్రాగిన పిదప ‘నల్లూరి శ్రీనివాస్’ “జై స్వచ్ఛ సుందర చల్లపల్లికి జై కొట్టి,
గురవయ్య మాస్టారి నీతి సూక్తులు విని,
రేపు కలుసుకోవలసిన ప్రదేశం నాగాయలంక రోడ్డు లోని ‘మల్లేశ్వరి సిమెంట్ కాంక్రీట్ వర్క్స్’ వద్ద అనుకుని ఇంటి బాటపట్టారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
21.10.2025.
అనితర సాధ్యమని
కొందరిది అత్యద్భుతంబని, కొందరేమొ ప్రయోగమంటూ
కొందరనితర సాధ్యమని, ఇంకొంద రత్యానంద కరమని....
ఎందరెందరొ ప్రశంసించిరి డెందముల నుప్పొంగి; మరి స్వ
చ్ఛంద సేవల నాచరించగ ఎందరొచ్చిరి ముందుకు?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
21.10.2025