3630* వ రోజు .....

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

23.10.25 గురువారం @3630* రోజు నాటి స్వచ్ఛ సేవా యజ్ఞం!

ఈ రోజు తెల్లవారుజాము 4.22 నిమిషాలకు కార్యకర్తలు నాగాయలంక రోడ్ లోని ప్రభాకర్ రైస్ మిల్లు వద్ద కలుసుకున్నారు. ప్రణాళిక ప్రకారం పని చేయటానికి తగిన పనిముట్లు చేత బట్టారు. అప్పటివరకూ వచ్చిన వర్షం అపుడే ఆగి అంతా చిమ్మ చీకటిగా ఉన్నా హెడ్ లైట్లు వెలుతురు లో వడివడిగా పని వైపు అడుగులు వేశారు.

నిన్న రహదారి ప్రక్కన అడవి తంగేడు మొక్కల చుట్టూ రోడ్ రెండు ప్రక్కలా కొంత భాగం శుభ్రం చేయగా వచ్చిన తుక్కును, గడ్డిని కొంతమంది ట్రాక్టర్ లో లోడ్ చేయడం జరిగింది.

మరికొంత మంది కార్యకర్తలు రైస్ మిల్లు మొదట్లోని దారి ప్రక్కనే ఉన్న వంతెన పై భాగంలో విపరీతంగా పెరిగిన చెట్లు పిచ్చి మొక్కల కలుపు గడ్డి లాగి శుభ్రం చేశారు. మరియు ఆ ప్రదేశం లో మందు బాబులు సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు, కవర్లు లాంటి ప్లాస్టిక్ వస్తువులు గుట్టగా పడవేశారు. గాజు సీసాలు సైతం పగుల గొట్టారు. వాటిని ఏరివేసి ఒక కార్యకర్త సంచుల కెత్తడం జరిగింది. ఒక కార్యకర్త గడ్డి కోత మిషన్ తో రహదారి మార్జిన్ ను సమానంగా కత్తిరిస్తున్నారు.

6 గ. ల వరకు పని చేసిన 24 మంది కార్యకర్తలు విజిల్ మ్రోగగానే పని విరమించిన కార్యకర్తలు కాఫీ సేవించిన పిదప ప్రేమానందం గారు పలికిన జై స్వచ్చ సుందర చల్లపల్లికి జై కొట్టి,

రేపు కలవవలసిన ప్రదేశం ఈ రైస్ మిల్లు వద్ద అనుకుని నిష్క్రమించారు.    

- నందేటి శ్రీనివాస్

ప్రజా కళాకారుడు

23.10.2025.

 

శ్రమోద్యమములు సాగ వెందుకు?-1

మాటలన్నీ చేతలైతే - కోతలన్నీ నిజములైతే

స్వంత ఊళ్లను ఉద్ధరించే సాహసము సత్ఫలిత మిస్తే

దేశమందున చల్లపల్లే దీటుగా మార్మ్రోగు టెందుకు?

స్వచ్ఛ సుందర కార్యకర్తలు అంతటా కనిపించ రెందుకు?

- నల్లూరి రామారావు

ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

23.10.2025