పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?
26.10.25 శనివారం @3633* రోజు నాటి స్వచ్చ శ్రమ విశేషాలు !
ఈ రోజు నాగాయలంక రోడ్ లోని పబ్లిక్ టాయిలెట్స్ వద్ద వేకువ జాము 4.23 ని.లకు కార్యకర్తలు చేరుకున్నారు.
“సొంత లాభం కొంత మానుకో - పొరుగు వారికి తోడుపడవోయ్” అన్న గురజాడ సూక్తి ప్రేరణగా వేరు వేరు వృత్తుల లో బాధ్యతలలో ఉన్న కార్యకర్తలు ఆదివారం వారివారి సొంత పనులు ఉండే పరిస్టితులలో నైనా పదిమంది కొరకు చేసే పనిని వాయిదా వేయకుండా సమయానికి చేరుకొని పనిముట్లతో సిద్ధమయ్యారు.
నిన్న మిగిలిన చెత్త గుట్టలు, ప్లాస్టిక్, పేపరు గుట్టలు ట్రాక్టర్ లో లోడ్ చెయ్యడానికి కొందరు కార్యకర్తలు వెళ్ళగా లోడింగ్ వెనుక రాలిన ఆకులను చీపుళ్ళతో శుభ్రం చేసుకుంటూ మహిళా కార్యకర్తలు పని చేసినారు.
కొంతమంది కార్యకర్తలు బ్రహ్మం గారి గుడి వెనుక ఉన్న గార్డెన్ లోని అపరిమితంగా పెరిగి వాలిపోయిన బోగన్ విలియా కొమ్మలను కత్తిరించి ఆ గార్డెన్ లో కలుపు, గడ్డి లాగి కొంత భాగాన్ని అద్దంలా చేయగలిగారు.
గడ్డి కటింగ్ మిషన్ తో నిన్నటి పని తరువాత కొనసాగింపుగా రోడ్డు మార్జిన్ లు ఒక కార్యకర్త కట్ చేస్తుండగా మరికొందరు పబ్లిక్ టాయిలెట్స్ కు ఎదురుగా రెండో ప్రక్క రోడ్డు పొడవునా గుడి మలుపు వరకూ కంప, పిచ్చి మొక్కలు తొలగించి డ్రైనేజీ కూడా పూడిక తీసి శుభ్రం చేశారు.
6 గం.ల వరకు పని చేసిన 28 మంది కార్యకర్తలు విజిల్ మ్రోగిన పిదప పని విరమించి కాఫీ ముచ్చట్లతో కొద్ది నిముషాలు సేద తీరారు. తదుపరి సమీక్షలో తూము వెంకటేశ్వర రావు గారు పలికిన జై స్వచ్చ సుందర చల్లపల్లి కి జై కొట్టగా,
రేపు విజయవాడలోని 6 వ నంబరు కాలువ సమీపంలో కార్ సర్వీసింగ్ పాయింట్ వద్ద కలుద్దాం అనుకుని ఇంటి ముఖం పట్టారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
26.10.2025.
అమందానంద ప్రదముగ?
గ్రామ పర్యావరణ రక్షణ చల్లపల్లిలొ జరుగు నట్లుగ
కళాకాంతితొ డ్రైన్లు - వీధులు కనుల విందొన రించు నట్లుగ
పచ్చదనములు - పూల సొగసులు ప్రజల మనసులు దోచునట్లుగ
అన్ని చోట్లా జరుగ వలదా అమందానంద ప్రదముగ?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
26.10.2025