సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దు!
పర్యావరణ హితమే ముద్దు!
27.10.25 సోమవారం 3634* రోజు నాటి స్వచ్ఛ శ్రమాదాన విశేషాలు!
ఈరోజు విజయవాడ రోడ్డులోని కార్ల షెడ్డు వద్ద వేకువ ఝాము 4:21 ని॥కు 13 మంది కార్యకర్తలతో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ క్రమేణ 30 మంది కార్యకర్తలు చేరికతో ఊపందుకుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా వాతావరణం ప్రశాంతంగా, కూల్ గా ఉంది. కార్యకర్తలు 6 వ నెంబర్ కాలువ వద్ద నుండి పని ప్రారంభించి ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోయారు.
చెట్లను ట్రిమ్మింగ్ చేస్తూ, ప్లాస్టిక్ చెత్తను ఏరివేస్తూ, చెత్తను చీపుళ్ళతో ఊడుస్తూ, పోగులు పెట్టిన చెత్తను లోడింగ్ చేస్తూ, రోడ్డు మార్జిన్ లను సరిజేస్తూ క్రమశిక్షణతో కార్యకర్తలు చేసే శ్రమదానం ప్రత్యక్షంగా చూడాలే గాని వర్ణించనలవిగాదు.
6 గంటలకు విజిల్ శబ్ధానికి పని విరమించి, కాఫీ సేవించి, ఒకరిపై ఒకరు సరసంగా ఛలోక్తులు వేసుకుంటూ Dr. DRK గారు చెప్పిన ఊటీ హరిత ప్రయాణ విశేషాలను విని,
‘గొరిపర్తి నాగశేషు’ గారు చెప్పిన నినాదాలకు ప్రతిస్పందించి,
రేపటి కార్యక్రమం విజయవాడ రోడ్డులోని కార్ల షెడ్డు వద్దేనని తెలుసుకుని ఇంటి ముఖం పట్టారు.
గమనిక :
రేపు ఉదయం వర్షం ఎక్కువగా ఉంటే కనుక మన స్వచ్ఛ కార్యక్రమాన్ని వాయిదా వేద్దాం.
తుఫాను కారణంగా గ్రామంలో ఏదైనా అవసరం అయితే మనం చేయగలిగిన సహాయం చేద్దాం.
- భోగాది వాసుదేవరావు
27.10.2025.
స్వస్తి శ్రీ....
స్వస్తి - వీధుల నూడ్చి అలసిన స్వచ్ఛ సుందర కారకర్తకు!
స్వస్తి - ముప్పది వేల చెట్లను సాకి పెంచిన కార్యదీక్షకు!
స్వస్తి - పుట్టిన ఊరి మేలుకు శ్రమిస్తుండే త్యాగ ధనులకు!
స్వస్తి - సుందర చల్లపల్లిని సమర్థించే సకల ప్రజలకు!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
27.10.2025