3635* వ రోజు . ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

28.10.25 మంగళవారం 3635* వ రోజు నాటి శ్రమ సంగతులు!

               ఈరోజు తెల్లవారుజాము 4.18 నిమిషాలకు కార్యకర్తలు ప్రణాళిక ప్రకారం విజయవాడ రోడ్డులోని కార్ సర్వీసింగ్ పాయింట్ వద్దకు చేరుకున్నారు. పనిముట్లు చేతబట్టి అక్కడ నుండి రహదారికి రెండు వైపులా చెత్తా చెదారాలను ఎత్తివేస్తూ వంగిపోయిన చెట్ల కొమ్మలను కత్తిరించుకుంటూ ఎంతో పరిశుభ్రంగా రహదారి కుడి ఎడమ భాగాలలో పనిచేశారు.

               బోగన్ విలియా మొక్కకు రక్షణగా పెట్టిన సిమెంటు ట్రీ గార్డు నీటి బోదెలో పడిపోయి మొక్క కూడా విరిగి ఎండిపోవడంతో దానిని అతికష్టంగా ట్రాక్టర్ కు కట్టి పైకి లాగడం జరిగింది.

               అలాగే రహదారి ప్రక్కన గుట్టగా పోసిన రద్దురాయి ముక్కను అక్కడ ఉన్న గోతులలో సరిపడా సర్దడం జరిగింది. దట్టంగా పెరిగిన బోగన్ విలియా మొక్కలను కటింగ్ మిషన్ తో అందంగా కటింగ్ చేస్తూ కార్యకర్త  మరో ఇద్దరు కార్యకర్తలు ఆ ప్రాంతమంతా సుందరంగా తయారుచేశారు. మహిళా కార్యకర్తలు పని జరిగిన వెంటనే చీపుళ్ళతో శుభ్రపరచడం చేశారు.

               ఆ సమయంలో కారుమబ్బులు కమ్మినా చలిగాలులు వీస్తున్నా తుఫాను హెచ్చరికలు వస్తున్నా ఏమాత్రం వాతావరణం అనుకూలంగా పని చేయడానికి అవకాశం ఉన్నా విరామమెరుగక పరిశ్రమించే చల్లపల్లికి ముద్దు బిడ్డలు ఈ స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తలు.

               వీరు 6 గంటలు దాటినా ఈరోజు పని పూర్తయ్యే వరకు శ్రమించి విజిల్ మ్రోగిన తరువాత పని విరమించి,

               అప్పుడే మొదలైన జోరు వర్షంలో తడుస్తూనే కాఫీ సేవించి,

               ఆసుపత్రి సిబ్బందిలో ఒకరైన స్వచ్చ కార్యకర్త జ్యోతి పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లికి జై కొట్టి,

               రేపు రావలసిన సమయంలో వర్షం లేకుండా ఉంటే, రేపు మనం కలవవలసిన ప్రదేశం విజయవాడ రోడ్ లోని కార్ సర్వీసింగ్ వద్ద అనుకుని నిష్క్రమించారు.

               వెలివెల కుటుంబరావు గారు ప్రతి నెలా ఆన్లైన్ లో పంపించే 5,000/- రూపాయల విరాళాన్ని ట్రస్టు అకౌంట్ కు బదిలీ చేశారు. వీరికి స్వచ్ఛ కార్యకర్తలందరి తరపున ధన్యవాదములు.  

- నందేటి శ్రీనివాస్

    ప్రజా కళాకారుడు

    28.10.2025.

               రాష్ట్రమంతట నిండిపోవా? - 1

కార్యకర్తలు లభ్యమైతే - స్వచ్ఛ సేవలు వ్యసనమైతే

కొందరైనా దాతలుంటే - పాత్రికేయులు పూనుకొంటే

ప్రవాసాంధ్రులు ప్రోత్సహిస్తే – గ్రామజనులాశీర్వదిస్తే

స్వచ్ఛ సుందర చల్లపల్లులు వ్యాప్తిచెందవ రాష్ట్రమంతట?

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    28.10.2025