3638* వ రోజు . ....

పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

31.10.2025 శుక్రవారం - 3638* వ రోజు నాటి స్వచ్ఛ శ్రమ ఘట్టములు!

               ఈ రోజు బైపాస్ రోడ్ లోని విజయ్ నగర్ కాలని సమీపంలో స్వచ్ఛ కార్యకర్తలు వేకువ జామునే 4.19 చేరుకున్నారు.

               ఇటీవలె స్వచ్ఛ కార్యకర్తలు వారి దైనందిన కార్యక్రమంలో భాగంగా బైపాస్ రహదారి మొత్తం అద్దంలా శుభ్రం చేశారు. కానీ మోంథా తుఫాన్ బీభత్సం వలన అక్కడక్కడా చెట్టు కూలడం, కొమ్మలు విరిగిపడి దారి ప్రక్కల చూస్తే కళావిహీనంగా అపరిశుభ్రంగా తయారయ్యింది. అంతేకాక ఇళ్ళ వద్ద తోటలో విరిగిన కొమ్మలు, ఆకులు కూడా ఆ ప్రాంతంలోని వారు రహదారి ప్రక్కన గుట్టలుగా పోశారు.

               ఊరి పరిశుభ్రత కొరకు పని చేయాల్సిన స్థానిక పరిపాలనా వ్యవస్థ కూడా జనాభాకు అనుగుణంగా తగిన మానవ వనరులు లేక అన్ని రహదారులూ శుభ్రంగా ఉంచలేని పరిస్థితులలో అందరూ చూసేది స్వచ్ఛ కార్యకర్తల వైపే.

               ఒక బజారులో షుమారు 50 కుటుంబాల పరిధిలో ఆ దారిలోఉన్న చెట్ల కొమ్మలు, అందరూ రోడ్డుపై పడవేసిన చెట్ల కొమ్మలు, ఆకులు, గార్డెన్ వ్యర్థాలను డంపింగ్ యార్డుకు చేర్చి అక్కడ కాలుష్య కాసారంగా మార్చకుండా ఉండాలంటే ఉదయం 2 గంటల పాటు 40 మంది కార్యకర్తలు రెక్కల కష్టంతో నిబద్ధతగా పని చేస్తేనే సాధ్యమయింది.

               కనీసం ఇలాంటి విపత్తులలోనైనా పని చేసే చోట స్థానికులు కూడా కలసి పనిచేస్తే స్వచ్ఛ సుందర చల్లపల్లి సాధనలో సమిష్టి భాగస్వామ్యానికి అర్థం పరమార్థం ఉంటుంది.

               ఈ రోజు ఉదయం అంతమంది కార్యకర్తలు నిమిషమైనా నీరసించక 2 గంటల పాటు అవిశ్రాంతంగా శ్రమిస్తుంటే ఓ ప్రజాకవి రాసిన “యంత్ర మెట్లా నడుస్తూ ఉందంటే”  అనే పాట గుర్తుకు రాకమానదు.

               ఉదయం 6.25 నిమిషాల వరకు నిర్విరామంగా శ్రమించి విజిల్ మ్రోగిన తరువాత కూడా కొంత సమయం చేసి పని విరమించిన కార్యకర్తలు కాఫీ సేవించిన తదుపరి సమీక్షలో,

               NRI నాదెళ్ళ సురేష్ గారు ఈ రోజు సేవలో ప్రత్యక్షంగా పాల్గొని నినదించిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” నినాదానికి స్వరం కలిపి జై కొట్టి,

               రేపు కలవవలసిన ప్రాంతం ఈ బైపాస్ లోని విజయ్ నగర్ కాలనీ వద్దే అనుకుని నిష్క్రమించారు.

- నందేటి శ్రీనివాస్

    ప్రజా కళాకారుడు

    31.10.2025.

               తొణకక బెణకకున్నవ

వచ్చుచున్నవి - పోవు చున్నవి పండుగలు పబ్బాలు దండిగ

రోజులెన్నోగడుస్తున్నవి ఋతువులెన్నో మారుచున్నవి

ఊరు సైతం సవ్య దిశలో కొంత కొంతగ – క్రమక్రమముగ

స్వచ్ఛ సుందర కార్యకర్తల శ్రమలె తొణకక బెణకకున్నవి!

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    31.10.2025