3644* వ రోజు . ....

 ఒకే ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం!

గురువారం నాటి స్వచ్ఛ సుందరోద్యమ వివరాలు @ 3644

1)  పనిదినం : 3644* వది

2) వర్జ్యం లేని వారం : గురువారం

3) జీత భత్యాలు లేని, ఇంకా చెప్పాలంటే – ఊరి మంచి కోసం డబ్బు ఎదురిచ్చే కార్యకర్తలు : నిన్నటి కన్నా తగ్గేదేలే - అన్నట్లు 46 మంది

4) ఎంచుకొన్న పని చోటులు : అటూఇటూగా నిన్నటివే!

     అనగా - 4 రోడ్ల కూడలి - మునసబు, సజ్జా, 1 వ వార్డు, బందరు రోడ్లన్న మాట!

5) పని వేళలు : వేకువ 4:15-6.14 నడుమ కాలం.

6) ప్రోగేసిన వ్యర్ధాలు : ఒక పెద్ద ట్రాక్టరు నిండుగా.

7) పనిమంతుల వివరాలు : పాతిక - 87 సంవత్సర వయస్కులు - నర్సులు, కాంపౌండర్లు, వైద్యులు, ప్రస్తుత - గతకాలపు ఉద్యోగులు, రైతులు, వృత్తి నిపుణులు, గ్రృహిణీమతల్లులు.....

8) 3 రోజులుగా దాదాపు ఒక చోటనే పనికి కారణాలు: పని నాణ్యత కోసం కొందరి పట్టుదలలు, క్రొత్తగా పుట్టుకొచ్చిన వ్యర్ధాలు, (ఎవరూ ఏమీ అనుకోకపోతే) ఇద్దరు ముగ్గురి చాదస్తాలూ...

9) నన్ను మరీ ఆకర్షించిన శ్రమ దృశ్యాలు : కర్మల భవనం వెనుక తట్టున 20 మంది తడి - పొడి మట్టిలో కూర్చుని, బట్టల్ని చెమటతో, దుమ్ముతో ఖరాబు చేసుకుంటూ పని చేయడం సరే - కూలీ నాలీ లేనేలేని కంచిగరుడ సేవలో వాళ్ల జోకులు, పట్టరాని ఆనందాలున్నూ - జమీందారు భవనం తూర్పు – ఉత్తరపు రోడ్లలో కత్తుల – గొర్రుల శ్రమలు.

10) నియమోల్లంఘనలు : అసలు నిర్ణీత పని వేళ 4:30-6:00 కాగా, అది కాస్తా ఎప్పుడో 4:15-6.15 గా మారడమూ, స్వయంగా ఉద్యమ నాయకుడే జరుగుతున్న శ్రమ సౌందర్య వీక్షణలో మునిగి, అలస్యంగా విజిలు ఊదడం!

11) 6.20 తదుపరి సమీక్షాకాలంలో : 9 వ తేదీ నాటి 11 ఏళ్ల పండుగ నిర్వహణ, వస్తున్న అతిథుల విశేషాలు,

12) కోడూరు వెంకటేశ్వరరావు గారి నెలవారీ చందా 520/-

               రేపు కూడ ఇదే బందరు వీధిలోనే శ్రమించాలనే నిర్ణయమూ!

            శ్రమకు తగ్గట్లుగా వ్రాయుట

వేలపుటలను వ్రాసితిని శ్రమ వేడుకను దినదినము చూస్తూ

గతంలోనూ నిర్వహించితి సహస్రాదిగ పద్యక్రతువును

వ్రాసి వ్రాసీ తృప్తి చెందితి - వాసికన్నా రాశి పెద్దది!

శ్రమకు తగ్గట్లుగా వ్రాయుట సాధ్యపడలా కొన్ని మారులు!

-నల్లూరి రామారావు

  ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  06.11.2025