ఒకే ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం!
శుక్రవారపు శ్రమ సంబంధిత ప్రశ్నోత్తరీయాలు - @ 3645
1) శ్రమ ప్రారంభ, ముగింపు సమయాలు? 4.14 & 6.12 AM
2) తొలి, మలి స్వచ్ఛ కార్యకర్తల సంఖ్యలు? 11 & 55.
3) ఆదర్శ శ్రమకు నోచుకొన్న చోటుల హద్దులు?
తూర్పు : సజ్జా, మునసబు వీధులు, పడమర : రిలయన్స్ మాల్, వెరసి బందరు మార్గంలోని 150 గజాలు.
4) కార్యకర్తల విశేషాలు?
చల్లపల్లి సర్కిల్ ఇన్ స్పెక్టరు గారు, పంచాయతి అధికారి మాధవేంద్రరావు గారు, మోకాలి శస్త్ర చికిత్స జరిగిన విశ్రాంతోపాధ్యాయిని గారు, మరీ ముఖ్యంగా ప్రమాదంలో తీవ్రగాయం తగ్గని - కర్రపోటుతో నడుస్తూ వచ్చిన మొక్కల సరఫరా దారు, అన్నిటికన్నా మరీ విశేషంగా - శ్రామికవర్గానికి చెందిన 4 కిలోమీటర్ల దూరపు మంగళాపురం నుండి వేకువనే వచ్చిన 10 మంది మహిళలు....
5) పని ఫలితాలు?
- దీనికి సమాధానంగా – 150 గజాల బందరు వీధి బారునా క్షుణ్ణంగా శుభ్రపడిన ఉభయదరులు, మారిపోయిన వీధి ఉద్యానాలు, దుకాణాల ముంగిళ్లు, దుమ్మూ ధూళీ తొలగిన స్వచ్ఛ రహదారుల ఛాయాచిత్రములు
6) ఎక్కువ మంది గ్రామస్తులకు పట్టని వీధి శుభ్రతా వ్యసనం ఈ 55 మందికే ఎందుకు?
A) ఎందుకంటే - కార్యకర్తల దృష్టిలోఈ పనులు వ్యసనం కాక అదృష్టమట!
B) మంగళాపురపు మహిళా కూలీల సామాజిక సత్కార్యంలో పాల్గొనకుండలేని నిస్సహాయతట! ఆలోచించగలిగే స్వార్ధ రహితులకు అంటుకొంటే వదలని జబ్బట! కొందరు అమాయక గ్రామ సోదరుల దృష్టిలో మాత్రం ఈ కార్యకర్తల ఖర్మట!
7) మరి – గొంతెత్తి స్వచ్ఛోద్యమాన్ని గానం చేసే పాటల పిచ్చోడి సంగతో?
పాపం అతను మాత్రం ఏంజేస్తాడులే - చిన్నప్పట్నుండీ వామపక్ష భావాలతో బ్రతికి, ప్రజానాట్యమండలిలో పనిచేస్తే ఇలాంటి వేషాలెయ్యకేం జేస్తాడు
8) చివరగా - సమీక్షా సమావేశం ఎలా జరిగెను?
ఓ - దానికేం – ఉత్సాహభరితంగానూ, రేపటి - ఎల్లుండిటి సమావేశపు ఏర్పాట్లూ, క్రమం తప్పక పుట్టినరోజు కాన్కగా పసుపులేటి ధనలక్ష్మి (ఈమే నేటి నినాదకర్త) మనుమల (ఋత్విక్, ఋషిక్) చెరొక 1000/- చందాలూ,
రేపటి పనుల కోసం మరొకమారు భగత్ సింగ్ వైద్య శాల వద్ద కలుసుకోవాలనే నిర్ణయమూ వగైరాలు!
చల్లపల్లిలో మినహా! – 1
నెలైనా తిరగకుండానే సిగపట్లకు దిగకుండా
నలభై - ఏభై మందసలిలా కలిసి ఉంటారా?
ఉన్నా స్వార్థం నశించి ఊరికై శ్రమిస్తారా!
చల్లపల్లిలో మినహా ఈవింతను చూశారా?
-నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
07.11.2025