3646* వ రోజు . ....

 ఒకే ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం!

3646* వ గ్రామ శ్రమదాన సంక్షిప్త సమాచారం!

               సంక్షిప్తంగా కాక - 63 మంది స్వయంప్రేరితులగు (డజను మంది మహిళలతో సహా) ఔత్సాహికులు వీధి కాలుష్యాల మీద కక్షగట్టి, వేకువ 4.15 - 6.15 ల మధ్య నెరవేర్చుకొన్న సామాజిక బాధ్యతనూ, పోటీపడిన చీపుళ్ల పరాక్రమాల్నీ, ఎడనెడ పిచ్చి మొక్కలు - కలుపుల మీద ఖడ్గ చాలనాల్నీ సవివరంగా చెప్పడం కుదిరేది కాదు గదా!

               వైద్యసిబ్బంది వీధి కాలుష్య గాయాలను నయం చేశారు, ప్రస్తుత, విశ్రాంత ఉద్యోగులు -ముఖ్యంగా ఉపాధ్యాయులు గ్రామస్తులకు స్వచ్ఛ శుభ్రతా పాఠాలు బోధించారు, ఉక్కపోతలతో-చెమటలతో కార్యకర్తలు సాధించిన గ్రామ మెరుగుదలలు సామాజిక బాధ్యతా పాఠ్య గ్రంథాలే!

               భగత్ సింగ్ వైద్యశాల మొదలు తూర్పు రామాలయం దాక ఈ ఉదయం 7.00 తర్వాత బందరు రోడ్డును పరిశీలించే వారికి ఈ 11 ఏళ్ల స్వచ్ఛ సుందరోద్యమం గ్రామానికేం ఒరగ బెట్టిందో తెలుస్తుంది.

               “ఫలానా రోజున ఫలానా వీధి శుభ్రతకు పూనుకొందాం” అనే సూచన తప్ప ఏ ఆదేశాలూ, అభ్యర్ధనలూ ఉండవిక్కడ! ఇవాళలాగా అరవయ్యేసి మంది కాకున్నా – పాతిక - ముప్పై మందైనా శ్రమ సన్నద్ధులై అక్కడ వాలుతారు; పరస్పర సౌహార్ద్ర కలయికతో గ్రామ సామాజిక బాధ్యత నెరవేర్చిన సంతృప్తితో ఇల్లు చేరుతారు!

               6.30 తర్వాత మహోత్సాహమయమైన సమీక్షా సమావేశం మొదలై, నాదెళ్ల సురేష్ గబగబా  వచ్చి, ఈ రాత్రి 7 - 9.45 నడుమ పెదకళ్లేపల్లి రోడ్డులోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో జరిగే తన మేనకోడలు - రావి సాయిబిందు వివాహానికాహ్వానించి వెళ్లగా,

               సందు చూసుకొని మనుమడి 4 వ పుట్టిన రోజని ఒక రిటైర్డ్ పిన్సిపల్ – తగిరిశ వారు 1000/- చందా ఇచ్చేస్తారు!

               పట్టుదలను ప్రతిధ్వనిస్తూ పాస్టరు డేవిడ్ మహాశయుడు స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలను అదరగొట్టేస్తారు!

               ఇక - మధ్య మధ్య ఛలోక్తులతో ఉద్యమ సారథుల వారు 10 నిముషాల పాటు స్వచ్చోద్యమ పూర్వాపరాలను ప్రస్తావిస్తూ ప్రకటించిన నేటి - రేపటి 11 వ వార్షికోత్సవ వివరాలు ఇట్లున్నవి:

1) ఈ సాయంత్రం 4:30 కు ముందే కార్యకర్తలు పద్మాభిరామం దగ్గరకు చేరుకొని వరుసలో వాహనాలను అమర్చి, బందరు వీధి గుండా స్వగృహ ఫుడ్ వద్దకు పాదయాత్ర,

2) అక్కడ గంటన్నరకు పైగా ‘మనకోసం మనం’ ట్రస్టు మూల పురుషుడైన గురవారెడ్డి గారి సరస సంభాషణలో పాల్గొనుట,

3) అటు నుండి నాదెళ్ళ సురేష్ గారి తాలూకు వైవాహికాహ్వానాన్ని మన్నించుట,

4) పనిలో పనిగా DRK గారు ఎన్నో సమావేశాలలో కార్యకర్తల క్రమశిక్షణను మెచ్చుకొనుట!            

5) నేటి, రేపటి వార్షికోత్సవ సమావేశాలకు క్రొత్త టోపీలు, చొక్కాలూ ధరించి వచ్చుట,

****

               9 వ తేదీ - అనగా రేపు వేకువ 4:35 కే కార్యకర్తలూ, ప్రజలూ NH 216 లోని స్వాగత ద్వారం చేరుకొనుట,

* వాహనాలతో ముందుగా తరిగోపుల ప్రాంగణానికి (విజయవాడ రోడ్డు – చిల్లలవాగు) వెళ్ళుట,

* తరువాత నారాయణరావునగర్ లోని ముస్లిం శ్మశానములో నూతన కట్టడాల సందర్శన,

* తిరిగి స్వగృహ ఫుడ్స్ పై గల సమావేశ మందిరంలో సభకు వాహనాలతోనే చేరుట,

* అక్కడ

1) మండలి బుద్ధప్రసాదు (MLA),

2) P. కృష్ణయ్య (IAS, పొల్యూషన్ బోర్డు చైర్మన్ )

3) డి.కె. బాలాజి (జిల్లా కలెక్టరు)

4) Dr A.V. గురవారెడ్డి (కిమ్స్, సన్ షైన్ ఆస్పత్రులు)  

గార్ల సందేశములను వినుట,

అల్పాహారములు సేవించి, సుమారు 11.గంటలకు మరలి వెళ్ళుట.

               చల్లపల్లిలో మినహా! – 2

కల్పిత కథలో మాత్రమె కనిపించే ఈ పద్ధతి

క్లిష్ట రాజకీయాలను, కులమతాల జాడ్యాలను

స్వార్థాలను వదలిపెట్టు - సామాజిక దృష్టి పెట్టు

ఈ వింతను చూశారా చల్లపల్లిలో మినహా?

-నల్లూరి రామారావు

  ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  08.11.2025