3647* వ రోజు .....

 ఒకే ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం!

3647* వ నాటి వార్షికోత్సవ వార్తా విశేషాలు !

ఈ ఆదివారం జరిగినవి దైహిక శ్రమలు కావు ఇంకో  సంవత్సరానికి సరిపడా ఆనందానుభూతులు!

కార్యకర్తలంతా వేకువ 4.30 కే ఊరికి దూరంగా NH 2 16 స్వాగత ద్వారం వద్దకు చేరుకోవడం సాదా వార్తే.

 అవనిగడ్డ సీనియర్ శాసనసభ్యుడూ,  A.P. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడూ, కృష్ణా జిల్లా యువ పాలకుడూ- అంతంత దూరాల నుండి వేకువ 5.00 కే అక్కడకు రావడం మాత్రం విశేష వార్తే !

ఇక పుర ప్రముఖులూ,  ఇతర అధికారులూ, కార్యకర్తలు - అందరూ శతాధిక సంఖ్యలో 6.00 కు వాహనాలతో- డప్పు వాద్యాలతో- శ్రమ దానోద్యమ ప్రచారంతో 3 కిలోమీటర్ల దూరపు తరిగోపుల ప్రాంగణానికి వెళ్ళడమూ, ఆ  నందనోద్యానంలో బృహత్ సామూహిక ఛాయా చిత్రానంతరం సుమారు 3 కి. మీ. దూరాన ముస్లిమ్ శ్మశాన వాటికలో ముప్పావు గంటపాటు సమావేశం నిర్వహించడం మరొక వార్తా విశేషం!

తిరిగి వీరంతా లక్ష్మీసాయి స్వగృహ ఫుడ్ సమావేశ మందిరంలో2 గంటల పాటు- 10.00 గంటల దాక అనుభవజ్ఞుల- మేధావుల విలువైన విశ్లేషణాత్మక ప్రసంగాలను వింటూ,  ఫోటోలు దిగుతూ, నందేటి వాని గాన గాంభీర్యానికి పరవశిస్తూ- స్వగృహ ఫుడ్స్ ఆనంద్ గారి ఆతిధ్యాన్ని రుచి చూస్తూ........ అదొక లోకంలో 5 గంటలకు పైగా గడిపి, ఇళ్లకు చేరడమా ఈ నాటి వార్తా విశేషమే!

దేశంలో మరెక్కడా జరగని11 ఏళ్ల సుదీర్ఘ శ్రమదానం వక్తలనుత్తేజపరచడమూ, కార్యకర్తల, ఉద్యమ సారథుల త్యాగాలను వారు పదే పదే ప్రశంసించడమూ, స్వచ్ఛ సుందరోద్యమానికి హార్ధిక - ఆర్థిక సహకార ప్రకటనమూ 130 మంది ప్రేక్షకులనంత కన్న ఉత్తేజితుల్ని చేసింది!

 గురవారెడ్డి, కాలేషా డాక్టర్ల లక్షల విరాళ ప్రకటనమూ, ముఖ్యంగా మొదటి డాక్టరు  “మనకోసం మనం” ట్రస్టుకు మూలధనం చేకుర్చుకోవాల్సిన అవసరాన్ని చెప్పడం స్వచ్చోద్యమకారుల మనఃస్థైర్యాన్ని పెంచింది.  ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారి చల్లపల్లి భవిష్యత్  సందర్శన వార్త యువతనుత్తేజ పరచింది.

- రేపు వేకువ 4.30 కు జరిగే శ్రమదానం బందరు వీధిలోని" రిలయన్స్ మాల్" వద్ద నుండి ప్రారంభమని కార్యకర్తలందరు తెలుసుకొనిరి.

               చల్లపల్లిలో మినహా! – 3

విద్యాధికులుద్యోగులు, పామరులూ, పండితులూ

వేకువ నాల్గున్నరకే వీధులందు పారిశుద్ధ్య

ఉద్యోగం చేసి, ఊరు నుద్ధరించు శ్రమ వేడుక

చరిత్ర గమనించారా చల్లపల్లిలో మినహా?

-నల్లూరి రామారావు

  ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  09.11.2025