ఒకే ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం!
మళ్లీ చెలరేగుతున్న వీధి పారిశుద్ధ్యం - @3648*
నిన్నటి వార్షికోత్సవ సంబరంతో కలిగిన ఎడబాటుకు ముగింపుగా ఈ సోమవారం వేకువ 4.30 కు కాదు - 4.12 కే తొందరపడిన 12 స్వచ్చ కోయిలలు ముందే శ్రమదానానికి దిగాయి!
వాటిల్లో ఒక కోయిలది ప్రస్తుత నివాసం విజయవాడ - ఉద్యోగం ఈనాడు పత్రిక. నిముష క్రమేణా ఈ ఊరి, ప్రక్క ఊళ్ల శ్రామిక కోకిలలూ వచ్చి కలిసి, మొత్తం ముప్పై మూడిటి బృందగానం వినవచ్చింది 6.12 దాక!
సదరు వీధి శుభ్రతా గాన కచేరీ వేదిక రిలయన్స్ మాల్ పడమటి వడ్లమర వీధి బారునా. అదొక్కప్పుడు తానే ఒక స్వచ్ఛ సైన్యంగా ఆ వీధి మొత్తాన్నీ శుభ్రపరచి, కంపుగొట్టే స్థలాన్ని ఉద్యానంగా మార్చిన వాసిరెడ్డి వారి కర్మక్షేత్రం!
అన్నట్లు - ఈ 33 స్వచ్ఛ సుందర కోయిలల్లో ఒకటి అమెరికాకు చెందిన మారథాన్ల కోకిల! ఈ సజాతీయ పక్షుల కృషిని వీధి ఆ చివరి నుండి బందరు మార్గం దాక గమనించగా:
- వడ్లమర దగ్గరి చెరువు మూల రకరకాల కాలుష్యాల తొలగింపే ఒక చిన్న యుద్ధంగా అనిపించింది!
- రిలయన్స్ మాల్ వెనుక తట్టునా, రోడ్డు వైపునా వ్యర్ధాలు తక్కువేం లేవు.
- చెరువు వైపు ఉద్యానంలో కూడ ప్లాస్టిక్ దరిద్రాలకూ, పిచ్చి చెట్లకూ, సింగిల్ యూజ్ సామాన్లకూ కొరత లేదు.
- కొబ్బరి బొండాల వ్యర్ధాలే ఏడెనిమిది డిప్పలైనవి!
అవన్నీ తొలగించి, వీధిని ఊడ్చి, లోడు చేసిన ట్రాక్టరేమో నిండు గర్భిణిగా కనిపించింది.
6:12 కు పనులు పూర్తి చేసి, కాఫీ పాన మొనర్చి, 6:30 – 6:55 నడుమ జరిపిన నేటి కృషి సమీక్షా సమావేశంలో:
1) గ్రామ స్వచ్ఛ సుందరోద్యమాన్ని 3 మార్లు నినదించిన ఈనాడు V. V. సుబ్బారావు గారు కార్యకర్తల పని ప్రావీణ్యతనూ, 11 ఏళ్ల ఉద్యమ సార్థకతనూ వివరిస్తే –
2) అడపా వారు నిన్నటి సభా విశేషాలను ప్రస్తావించి, సూక్తులు వినిపిస్తే -
3) నాదెళ్ల సురేష్ నిన్నటి వక్తల ప్రసంగాలను విశ్లేషిస్తే –
Dr. డి. ఆర్.కె. గారు మరిన్ని వివరాలను తెలిపి, రేపటి పనిపాటులు కూడ బందరు రోడ్డులోని తూర్పు రామాలయం వద్దనని కూడ ప్రకటించారు.
చల్లపల్లిలో మినహా! – 4
చాల మంది నమ్మలేక స్వయముగ ఇచ్చటికి వచ్చి
వేకువనే నిద్ర లేచి, వీధుల్లో జరుగు స్వఛ్ఛ
సేవల పరిశీలనతో నిశ్చేష్టులైన ఉదంతాన్ని
చల్లపల్లిలో మినహా చూశారా ఎక్కడైన?
-నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
10.11.2025