3649* వ రోజు . ....

 ఒకే ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం!

3649*  వ పని దిన౦ శ్రమత్యాగాన్ని గుర్తిద్దాం!

               మంగళవారం (11-11-25) నాటి ఆ వీధి పారిశుద్ధ్య శ్రమ వేకువ 4.15 కి 11 మందితోనే మొదలయ్యెను గాని, 4:30 తరువాత ఆ సంఖ్య గబగబా పెరిగి 38 కి చేరింది.

               నేటి వీధి బాగుదల కోసం కార్యకర్తలు ఆగింది కమ్యూనిస్టు వీధిలో, శ్రమించింది

1) బందరు వీధి 200 గజాల బారునా,

2) భారతలక్ష్మి వడ్లమర దాపునా,

3) తుది సమావేశస్థలం యాక్స్ టైలర్స్ ఎదురుగానూ!

               చెప్పాలంటే వీళ్ల శ్రమలోని వైవిధ్యాలు, ఉత్సాహాలు, మహిళల అంకితభావాలు, పనుల్లో పొందే ఆనందాలు చాలా ఉన్నా, రేఖా మాత్రంగానైనా వాట్సప్ - ఫేస్ బుక్ పాఠకులకు చెప్పటం నా ధర్మం!

1) తొలుత ఏడెనిమిది మంది చీపుళ్ళతో వ్యర్ధాల్ని ముఖ్యంగా దుమ్ము – ఇసుకల్ని ఊడ్చేటప్పుడు వీధిచారులకు ధూళిమేఘంతో అసౌక్యర్యం మాట వాస్తవం!

2) ఇదే వీధిలో షాదీఖానా సందు వద్ద 15 మంది మురుగుకాల్వలో దిగలేదు గాని - గొర్రులతోనూ, చేతులతోనూ డజన్ల డిప్పల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లనూ, ప్లాస్టిక్ సంచుల్నీ, ప్రాత గుడ్డల్నీ, పుల్లల్నీ ఆకుల్నీ బైటకు తెచ్చినపుడు గాని ఆ మురుగు నీరు స్వేచ్ఛగా ముందుకు నడిచిన వైనం!

3) చీపుళ్ల వారు మాత్రం ఒక ప్రక్క చెతుర్లాడుకొంటూనే షాబుల్ వీధి దాక దుమ్మూ – ఇసుకా ఊడ్చి ప్రోగులు పెట్టారు.

4) ఇక డజను మంది ఖడ్గ తిక్కన్నలు వీధి రెండు ప్రక్కలా మార్టిన్లలో పెరిగిన గడ్డి, పిచ్చిమొక్కల అంతు చూశారు!

5) చివరగా 2 ట్రాక్టర్లలో రెండు విధాల వ్యర్ధాలు - గురవారెడ్డి బండిలో దుమ్ము - ఇసుకల మిశ్రమూ, ట్రాక్టరులో ఇతరములూ లోడింగు పనులు. ఈ చివరి స్వచ్చ ప్రక్రియ 15-20 నిముషాల పాటు సామాజి స్పృహ ఏ కాస్త ఉన్న గ్రామస్తుల్నైనా ఆకర్షించి తీరుతుంది! మొదటి పని విరమణ విజిల్ మ్రోగి, “పని మిగిలిపోతున్నదే” అనే ఆదుర్దా, ఆ మురుగు నీరు కారే వ్యర్ధాల్ని కసిగా వాటేసుకొని ట్రాక్టరులోకి విసిరే ఉడుపూ, బండి మీద అంజయ్య వాటినందుకొని, సర్ది త్రొక్కే పద్ధతీ ఎవర్నైనా కదిలించి తీరాలి!

సమీక్షా సభలో:

A) కలెక్టరు శ్రీ లక్ష్మీకాంతం గారి త్వరలో స్వచ్ఛ చల్లపల్లి సందర్శనా కుతూహలమూ,

B) నేటి శ్రమదానం పట్ల DRK గారి సంతృప్తీ,

C) రేపు ఇదే బందరు వీధిలో సంత బజారు వద్ద కలుసుకోవాలనే నిర్ణయమూ!

               స్వచోద్యమ ఖర్చుల నిమిత్తం రిటైర్డ్ టీచర్ “యార్లగడ్డ పుష్పసుందరావతి” గారు 5,000/- రూపాయలను డాక్టరు గారికి అందజేసినందుకు కార్యకర్తలందరి తరపున ధన్యవాదములూ. 

            చల్లపల్లిలో మినహా! – 5

క్రొత్త కథ కానె కాదు - గత పన్నెండేళ్ల నుండి

తెరచిన పుస్తకం లాగ - తెల్లవారు జాములోనె

విసుగు - విరామం చెందక వీధుల్లో జరుగుతోంది

చల్లపల్లిలో మినహా చూడరు మీరింకెక్కడ!

-నల్లూరి రామారావు

  ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  11.11.2025