3650* వ రోజు . ....

ఒకే ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం!

3650* వ వేకువ శ్రమ వీచికలు

               అనగా బుధవారం (12-11-25) బ్రహ్మకాలం - నాలుగ్గంటల పదమూడు నిముషాల నుండి 6.13 దాక 40+ మంది నెరవేర్చుకొన్న వీధి పారిశుద్ధ్య పనులు!

               11 ఏళ్లనాడు అర్థ శతదిన శ్రమదానం పూర్తయితేనే గ్రామస్తులు, పాత్రికేయులు, పరిశీలకులు వింతగా - గొప్పగా భావించే వారు! మరి ఇది 73 వ అర్థ శతదిన గ్రామ పారిశుద్ధ్యం!

               4.13 AM కు పదముగ్గురు వచ్చి నిలిచింది సంత బజారూ, బందరు వీధీ కూడలి వద్ద; మరో 28 మందనుకొంటా - వచ్చి, కలిసి, పనులు చేసింది షాబుల్ వీధీ వెంకటేశ్వరస్వామి ఆలయం దాకా; చీపుర్ల ఊడ్పు వేగానికి ఎగిరి, వాళ్ల బట్టలకూ, ముఖాలకూ, ముక్కుల్లోకీ ఏపాటి దుమ్ము చేరిందో గాని, ఎక్కడికక్కడ 50 కి పైగా ఇసుకా-దుమ్మూ సమ్మేళనపు గుట్టలు!

               ఏరిన ప్లాస్టిక్ వస్తువులూ, ప్రోగులు చేసిన గులక రాళ్ళూ, అట్టపెట్టెల ముక్కలూ, కూరగాయల అవశేషాలూ వీటి కదనం!

               ఒక ప్రక్కన అయ్యప్ప స్వాముల భజనల మ్రోతలు, స్వచ్ఛ కార్యకర్తలు శ్రమ తెలియకుండా వినే రోజువారీ చైతన్య గీతాలు, టీ - కాఫీ అంగళ్ళ వద్ద ప్రయాణికుల - ప్రజల చేరికలు, వాటన్నిటిని మరపిస్తూ శ్రమదాతల చేతి పారల, చీపురుల గరగరలు!

               అసలిక్కడ గంటన్నరకు పైగా - వేగంగా క్రమపద్ధతిగా పని చేసుకుపోతున్నది రోబోలా, సర్కస్ మనుష్యులా, మరో ప్రపంచపు దేవదూతలా..... అనే సందేహమూ అప్పుడప్పుడు కలుగుతుంటుంది!  (- కేవలం భౌతిక నేత్రంతో కాక కాస్తంత్ర కవితా నేత్రంతో చూసేవాళ్లకి!)

               ఒక ప్రక్క వాహనాలను తప్పుకొంటూ – ఊడ్చే వాళ్లు ఊడుస్తూ - మట్టి గుట్టల్ని ట్రక్కులో   

లోడింగు చేస్తూ - పోలీస్ వీధి మొదలునూ, సంత బజారు కూడలినీ వదలక శుభ్రపరుస్తున్న దృశ్యాన్ని చూస్తే నాకలాంటి ఆలోచనే తట్టింది!

               చివరి సమీక్షా సభలో పాటగాడు గొంతెత్త లేదు గాని  -

               పల్నాటి భాస్కరుడు ముమ్మార్లు ఉద్యమ నినాదాలను అదరగొట్టి, వారం రోజుల కష్టార్జితమైన కిలోమీటరు బందరు రోడ్డు సౌందర్యాన్ని డా. డి.ఆర్.కె. గారు అందరికీ చూపించి,

               రేపటి మన వీధి పారిశుద్ధ్య పరీక్ష ATM కేంద్రం లేదా పోలీసు ఠాణా వీధిలోనని ప్రకటించగా, నేటి కృషికి విరామం చిక్కింది!

               రామానగరం వాస్తవ్యులు మిలటరీ శ్రీనివాసరావు గారి స్వచ్చోద్యమ ఖర్చుల నిమిత్తం 500/- రూపాయల విరాళానికి స్వచ్ఛ కార్యకర్తలందరి తరపున ధన్యవాదములు.   

               చల్లపల్లిలో మినహా! – 6

ఠంచనుగా నాల్గింటికె మంచం దిగి, బయలుదేరి

రహదారుల చెత్తా – చెదారం తొలగించే పనులకు

ఆడా - మగ కార్యకర్త లతి శ్రద్ధగ పూను వింత

సాక్షాత్కారం జరుగదు చల్లపల్లిలో మినహా!

-నల్లూరి రామారావు

  ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  12.11.2025