3652* వ రోజు . ....

 ఒకే ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం!

14.11.2025 – శుక్రవారం 3652*  వ రోజు నాటి స్వచ్చోద్యమ ఘట్టాలు

               ఈరోజు తెల్లవారుజాము 4:17 నిమిషాలకు కార్యకర్తలు సంత బజారు మొదట్లో కలుసుకుని పనికి ఉపక్రమించారు.

               బందర్ రోడ్ లో చేయవలసిన పని తారు రోడ్డు శుభ్రం చేయడం. అంటే అది అంత తేలికైన పని అనుకుంటున్నారేమో అంగుళం మందాన రహదారి రెండు వైపులా మూడు మీటర్ల చొప్పున రోడ్డు ఇసుకతో పూడుకుపోయి, తారు రోడ్డు కొద్దిగా మాత్రమే మధ్యలో కనబడుతుంది.

               ఎక్కువమంది కార్యకర్తలు చీపుళ్ళను చేతబట్టి తారు రోడ్డు ప్రత్యక్షమయ్యే వరకు రెక్కలు ముక్కలయ్యే లాగా “కర్ర చీపుర్లతో” శుభ్రం చేశారు. మెయిన్ రోడ్ అంచు వరకు కొన్ని చోట్ల ఉన్న ఆక్రమణల మధ్యన శుభ్రం చెయ్యడం ఎంతో కష్టంగా మారింది.

               అంత దుమ్ము - ధూళి - మురుగు డ్రైనుకు అత్యంత సన్నిహితంగా టిఫిన్ బళ్ళు, స్వీట్ షాపులు, పానీ పూరి బళ్ళు, బిర్యాని పాయింట్లు ఇవన్నీ దుమ్ము ధూళి మురుగు కాల్వ చెంత బాక్టీరియాతో సహవాసం చేస్తున్నాయి. జనం మాత్రం ఇవన్నీ శుభ్రం చెయ్యడం స్వచ్ఛ కార్యకర్తల పనిగాని మాకేంటి సంబంధం అన్నట్లు పబ్బం గడుపుకుంటున్నారు.

               సంత బజారు నుండి ATM సెంటర్ వరకూ 37 మంది కార్యకర్తలు చెమటోడ్చి పరిశుభ్రం చేశారు. కొంతమంది కార్యకర్తలు పోగు చేసిన మట్టి గుట్టలను ట్రాక్టర్ లో లోడ్ చేశారు. కొంతమంది రోడ్డు మీదికి అడ్డుగా వచ్చిన గంగరాయి కొమ్మలను తొలగించారు.

               6 గంటల వరకు శ్రమించి విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి కాఫీ సేవించి,

               తదుపరి మొక్కల రమణ గారు పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” కి జై కొట్టి, గృహ ప్రవేశం సందదర్భంగా రేపు ఉదయం కార్యకర్తలను అల్పాహారానికి ఆహ్వానించారు.

               రేపు కలవవలసిన ప్రదేశం ఈ ATM సెంటర్ వద్ద అనుకుని నిష్క్రమించారు.    

               “గ్రామంలో చెత్త చెదారం – కనిపించని కాలమెప్పుడో

               ప్రతి పౌరుడు ఊరి బాధ్యతలు – పాటించు ముహూర్తమెన్నడో?”

- నందేటి శ్రీనివాస్

   ప్రజా కళాకారుడు

   14.11.2025.       

               చల్లపల్లిలో మినహా! – 8

“పట్టక నిద్రలు బొత్తిగ – పని - పనిపాటులు లేనట్లుగ

వీధికెక్కి ఇంతమంది వింతగా ప్రవర్తించే”

అపప్రధను పోగొట్టే స్వచ్ఛ సేవ గావించే

విచిత్రాన్ని చూసితిరా చల్లపల్లిలో మినహా?

-నల్లూరి రామారావు

  ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  14.11.2025