పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?
RTC బస్ ప్రాంగణ పునః సుందరీకరణ! @3658!!
గురువారం (20-11-25) నాటి వేకువ 4:20 – 6:12 వ నడుమ తమ గ్రామ బాధ్యలకు పూనుకొన్న తొలి కార్యకర్తలు 10 మందైతే, కాస్త వెనుకా ముందుగా శ్రమించింది మరో 22 మంది!
నిన్నటి 48 వ వార్షిక జ్ఞాపకం - 19-11-1977 దివి తుఫానును గుర్తు చేసిన 3 వారాల నాటి తుఫానుకు అస్తవ్యస్తమైన బస్ స్టాండును మామూలు స్థితికి తేవడం ఎంత కష్టమో 45 పని గంటలు కష్టించిన ముప్పై ఇద్దరు స్వచ్చ కార్యకర్తలకే తెలుస్తుంది.
3 విధాలుగా జరిగిన నేటి శ్రమదానాలిట్లున్నవి :
1) ఇన్ గేట్ వైపున పడిన పెద్ద పొడవాటి గుంటనూ, రెండు గోతులనూ పూడ్చివేత మొదటిది. తొలుత రాళ్ళు పేర్చి, చదును చేసి, పైన గులకరాళ్ళూ మట్టీ కప్పి, తడిపి, అణగ గొట్టి వాహనాల రాకపోకల సౌకర్యం కల్పించిన తీరు అద్భుతం!
2) వాహన నిష్క్రమణ ద్వారం వైపున తుఫానుకు చిందరవందరైన చెట్ల కొమ్మల్నీ, పుల్లల్నీ, ఆకుల్నీ సరిగా వెలుతురు లేని చోట మర రంపంతో నరికి - ఏరి – బైటకు మోసిన ఐదారుగురి పనీ తేలికైనదేం కాదు!
3) ఇటు మూత్రశాలల వద్ద గార్డెన్ ను శుభ్రపరచడం గాని, పెదకళ్లేపల్లి రోడ్డు వైపున డజను మంది పిచ్చి చెట్లనూ, గడ్డినీ, ముఖ్యంగా గాలికి విరిగిన కొమ్మల్నీ నరికి, ట్రాక్టరులో కెక్కించిన శ్రమనూ గమనించాను.
ఒక శివబాబు గొడ్డలితో అరగంట పాటు కూలిన చెట్టు మొదలు నరకడం గాని, ఒకేఒక అంజయ్య రెండు ట్రక్కుల చెత్తను ఒక్క ట్రాక్టరులోనే సర్ది తొక్కిన నైపుణ్యం గాని నా దృష్టిని ఆకర్షించకపోలేదు!
ఎందరు గడ్డి చెక్కితే, చీపుళ్లతో ఊడిస్తే, బస్టాండు తెల్లారాక ఈ మాత్రం శుభ్రంగా కనిపిస్తున్నదో ప్రయాణికులు తెలుసుకోవాలి.
ఇక్కడేమో పని సందడీ, దూరంగా జరిగిన సమీక్షా సభలోనూ నిన్నా - మొన్నటి - నేటి సామాజిక సేవాంశాల ముచ్చట్లూ! 86 ఏళ్ల Dr. సమరం గారి, 70 ఏళ్ల రెడ్ క్రాస్ రాష్ట్ర అధ్యక్షులు రామారావు గారి సేవానిరతి!
ట్రాక్టర్లో త్రొక్కిన వ్యర్ధాల మీద కసి తీరక - ఒకమారు కాదు రెండు మార్లు నినాదాల మీద అంజయ్య గారు చూపిన కసీ!
రానున్న 3-4 రోజులూ మన బాధ్యతలు ఈ RTC బస్ స్టాండు కే పరిమితమనే నిర్ణయంతో నేటి కార్యక్రమం పూర్తి!
షాజహాను గుర్తొస్తడు
తాజమహల్ చూడగానె షాజహాను గుర్తొస్తడు
హైటెక్ సిటీ చూస్తుంటే యాదికొచ్చునది ఎవ్వరు?
ఈరహదారిన పోతూ ఇంతందం (NH216) చూస్తుంటే
స్వచ్ఛ సైనికుల కష్టం కదా జ్ఞప్తి రావలయును?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
20.11.2025