చల్లపల్లిలో స్వచ్ఛ కార్యకర్తల హరిత వేడుకలు.
చల్లపల్లి స్వచ్ఛ సుందరోద్యమ 11 సంవత్సరాల వేడుకలు ఈ నవంబర్, 2025 - 8, 9 తేదీలలో జరిగాయి. తొలిరోజు ఈ ఉద్యమ మూలకారకుల్లో ఒకరైన డాక్టర్ గురవారెడ్డి గారు ముఖ్యఅతిధిగా సాయంత్రం 4.35 - 8.30 మధ్య పురవీధుల్లో పాదయాత్ర, స్వగృహ ఫుడ్స్ సమావేశ మందిరంలో ఆత్మీయ సభ, స్వల్పాహార విందూ జరిగాయి.
త్రాగు నీళ్ళ కోసం స్టీలు సీసాలు, కాఫీలకు పునరుపయోగ్యమైన స్టీలు గ్లాసులు, ఆహారాలకు అరటాకులున్న స్టీలు కంచాలు తప్ప ఒక్కసారికే పరిమితమైన ప్లాస్టిక్ కప్పులు, సీసాలు, క్యారీబ్యాగులు, స్ఫూన్లు, వంటివి మచ్చుకైనా కన్పించలేదు.
9 వ తేదీ ఉదయం 4: 40 – 9:30 నడుమ జరిగిన ఐదారు కిలోమీటర్ల వాహన యాత్రలోగాని, డంపింగ్ యార్డు దగ్గర, ముస్లిమ్ శ్మశాన వాటిక వద్ద, మరొకమారు లక్ష్మీసాయి స్వగృహ పుడ్స్ హాలులో - MLA బుద్ధ ప్రసాదు గారు, పొల్యూషన్ కంట్రోలు బోర్డు అధ్యక్షులు కృష్ణయ్య గారు, కిమ్స్ సన్షైన్ నిర్వాహకులు గురవారెడ్డి గారు, గ్రామ ప్రముఖులు పాల్గొన్న సభలోనూ అంతే!
ఏ ఒక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువూ కనపడలేదు. అటు హోటల్ యాజమాన్యం గాని, ఇటు, సభా నిర్వాహకులుగాని, ఫ్లెక్సీలు గాని - పర్యావరణధ్వంసక ప్లాస్టిక్ లుగాని వాడకపోవడమూ, చక్కని క్రమశిక్షణ పాటించడమూ, స్పష్టంగా తెలిశాయి.
ఇందుకు గాను పాల్గొన్న వందలాది స్వచ్ఛ కార్యకర్తలూ, మాటలకు పరిమితం కాక ఆచరణలో పర్యావరణ మిత్రులుగా నిలిచిన ఉద్యమ నిర్వాహకులూ, స్వగృహ సమావేశ మందిర యజమాని ఆనంద్ గారూ అభినందనీయులు.
8 వ తేదీ రాత్రి వాసవి కల్యాణ మండపంలోని సాయి బిందు వివాహ వేడుక కూడ అంతే! పర్యావరణహితంగా జరిగింది. దేశవ్యాప్తంగా జరిగే వేల - లక్షల వేడుకలన్నీ ఇలా నిర్వహిస్తే ఎన్ని వేల టన్నుల విషతుల్యమైన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లను అరికట్ట వచ్చో ఆలోచించండి.
-నల్లూరి రామారావు
21.11.2025