పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?
“ఆహా!” అనిపించిన సామాజిక – సామూహిక శ్రమదానం @3660*
చల్లపల్లి స్పచ్ఛ సుందరోద్యమంలో శలవు దినాలనేవి జాన్తానై! పైగా – అందరికీ ఆటవిడుపులైన శని – ఆదివారాల్లో సదరు గ్రామ సేవలు మరీ ఉధృతమౌతుంటాయి కూడ! సొంతానికి ఆశించిక చేసే పనులిలాగే ఉంటాయి మరి!
ఉదాహరణకు ఈ శనివారం (22-11-25) వేకువ శ్రమానందాన్ని గమనించండి -
4.30 కు కాదు - 4.17 కే షోడశ కార్యకర్తలు RTC ప్రాంగణంలో హాజరు! 3 చోట్ల స్పచ్ఛ కార్యక్రమం -
1) RTC ఆవరణం,
2) పద్మావతి ఆస్పత్రి పరిసరం
3) P.K.. పల్లి రోడ్డులోని మేకలడొంక.
జరిగిన పనులంటారా? ఏ రోజైనా వాటికేం లోటు గనుక ? ముందుగా రెస్క్యూటీం సంగతే చూద్దాం - కాస్త వయసు మీరిన ముగ్గురితో సహా వాళ్లు పంచ పాండవులు! తొలుత బస్టాండులోని, తరువాత ఆస్పత్రి దగ్గరి మొన్నటి తుఫానుకు విరిగి కూలిన భారీ వృక్ష కాండాల్ని వాళ్లెలా ట్రాక్టరులోకి ఎక్కించారో - కోత మిల్లు దగ్గరకు చేర్చి, దించారో అదంతా స్వయంగా చూసి తీరవలసిన దృశ్యాలే!
మరి - బస్ ప్రాంగణంలోని 3 విధాల – 3 చోట్ల పనులు మాత్రం తక్కువా? మొదటిది - ఆస్పతి మహిళా సిబ్బంది 5 గురు స్కూటర్ల – సైకిళ్ల స్టాండును క్షుణ్ణంగా శుభ్ర - సుందరీకరించే అవకాశాన్ని సద్వినియోగపరచుకొన్నారు - వాళ్ల బట్టలు దుమ్మే కొట్టుకొన్నాయో - ఒంటి నిండా చెమటలే కారాయో - అది వేరే సంగతి!
రెండవది - ఒకప్పుడు తాతినేని రమణ నిర్వహించిన నర్సరీ ప్రాంతంలో 15
మంది పట్టి పట్టి శుభ్రపరచిన ప్రస్తావనార్హ శ్రమ! అందులో సగం మంది వంచిన నడుములెత్తనే లేదు! గంటల తరబడీ పని చేసిన ఈ ముఠా అద్దంలా ఉన్న ఆ 2 సెంట్లలో నిలబడి ఫొటో దిగడమంటే – తమ సంతృప్తిని రోజంతా నిలుపుకోవడమన్నమాట!
మూడవ పని - మరొకమారు పెద్ద గార్డెన్ ను మరింత శుభ్రంగా - పొందికగా మార్చడమే! ఆ 20 మందీ మరీ ముఖ్యంగా 5.55 - 6.29 నడుమ ప్రదర్శించిన అభినివేశమూ, తత్ఫలితంగా తుఫాను ముందటి రూపు సంతరించుకోవడమూ – నేను కాక - మంచి కవి ఎవరైనా చూస్తే ఒక మంచి కావ్యమే వ్రాసి ఉండేవాడు!
అక్కడికీ విజిల్ ఊదే ఆయన 3 మార్లు బాగా మ్రోగించి, కొందర్ని బ్రతిమాలి, సాధ్యపడక - చేతులెత్తేస్తే - అరగంట ఆలస్యంగా 6.30 కు పని పూర్తిచేసి గాని వాళ్ళు గార్డెన్ బైటకు రాలేదు!
మరొక విశేషం - వెలివోలుకు చెందిన మహిళ ఎక్కడికో వెళ్తూ బస్ దిగి, వీళ్ల శ్రమదానంతో తక్షణ ప్రేరణ పొంది, 20 నిముషాలు పని చేయడం!
46 మంది పాల్గొన్న సమీక్షా సభలో :
1) నేటి పని పట్ల DRK గారి ఆశ్చర్యార్ధకాలూ,
2) అడపా గురవయ్య సూక్తులూ, వారి స్వగ్రామంలో 12:00 కు భోజనాలకాహ్వనమూ
3) రేపటి మన వీధి బాధ్యతలు విజయా కాన్వెంటు ప్రక్క వీధిలో అనే సమాచారమూ!
దేన్ని మరచిపోగలను?
“అన్నా! వదినా! బాబాయ్!” అని సంబోధించటమా?
కులమతాల రొస్టు వీడి కలసిమెలసి శ్రమదానమా?
ఒకే మాట - ఒకే బాట - ఒకే సేవ పద్ధతులా?
ఏ విషయం మెచ్చవలెను? దేన్ని మరచిపోగలను?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
22.11.2025