పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?
3663* వ వేకువ సేవల సారాంశం!
మంగళవారం (25-11-25) శ్రమదానాలు కూడ మళ్లీ RTC బస్ స్టాండులోనే, అవి 30 మందివి; వేకువ 4:17 -6:17 ల నడిమి కాలానివి; ఒక ప్రక్క పని విరమణ సూచిక విజిల్ మ్రోగుతున్నా ఒక పట్టాన విరమించనివి.
“30 మందో - 40 మందో వారం రోజుల పాటు శ్రమను ధారపోసేంతగా ఇక్కడ కాలుష్యాలేమున్నవి? మొదటి 2-3 రోజులకే బస్ ప్రాంగణం అందంగా తయారైందే....” అని చాల మందికి అనిపిస్తుంది.
కాని ఈ స్వచ్ఛ కార్యకర్తలకు మాత్రం అలా తృప్తి కలుగదు, ఎక్కడైనా ప్లాస్టిక్ సింగిల్ యూజ్ సామాన్లు కనిపిస్తే వాళ్ల మనసులు చివుక్కుమంటాయి, చెట్ల కొమ్మలు అడ్డదిడ్డంగా పెరుగుతుంటే వాళ్లకు నచ్చదు, RTC బస్టాండే కావచ్చు - మురుగు కాల్వల వ్యర్ధాలే కావచ్చు, రోడ్డు దుమ్ము కావచ్చు, ఓర్చుకోలేని బలహీనత వాళ్లది! తొలగించే దాకా చల్లారని కసి!
11-12 ఏళ్ల నుండీ గ్రామ కాలుష్యాల మీద, పచ్చదనం లోపాల మీద, ఇతర అస్తవ్యస్తతల మీద వాళ్లిందుకే గదా అలుపెరుగని పోరాటం చేస్తున్నది? తమ సంఖ్య 30-40 కే పరిమితమౌతున్నా - క్షేత్రస్థాయిలో గ్రామస్తుల సహకారం అంతంత మాత్రంగా ఉంటున్నా వారి పోరాటం ఆగలేదు కదా! సదరు పోరాటంతోనే గదా ఈ గ్రామం ఈమాత్రం అందంగా శుభ్రంగా ఉంటున్నది!
ఈ పూట వాళ్ల యుద్ధరంగం RTC ప్రవేశద్వారం వైపు; ఐదారుగురు ఇతరత్రా ఊడ్పులు, గడ్డి చెక్కుడులూ, లోడింగులూ వంటి పనులు చేసినా - పాతికమంది కష్టం ఆ 15-20 సెంట్ల జాగాకే అంకితమయింది.
ఇక అక్కడి పనులా? వాటికేం-భేషుగ్గా జరిగాయి. ప్రయాణికులు అలవోకగా విసిరే ప్లాస్టిక్ వ్యర్ధాలుండగా, ప్రక్క ఇళ్ల వారు గోడ మీదుగా వెదజల్లే తుక్కులుండగా, కార్యకర్తలే నాటి - పెంచిన చెట్ల కొమ్మలు బస్ లకు అడ్డొస్తుండగా, మద్యపాన మహాశయులు వదిలేసే బుడ్లు, గ్లాసులుండగా పాతిక ముప్పై మంది స్వచ్ఛ కార్యకర్తలకు పనులకేం లోటు?
ఈ వేకువ సమయంలో శ్రమదాన సందడి కాస్త శ్రుతిమించింది. అందుక్కారణం గంటన్నరకుపైగా భీకరంగా మ్రోగుతూ 2 బళ్ల కొమ్మ - రెమ్మల్ని చూర్ణం చేసిన షెడ్డరే! అదికాక మరో ట్రాక్టరు తుక్కులు నిండిపోయినవి కూడ!
నిస్వార్థంగా ఇంతింత శ్రమ జరిగినప్పటి కార్యకర్తల సంతోషాన్ని, అట్టి శ్రమానంద లహరిలో మునిగి తేలిన Dr. DRK గారి తృప్తినీ 6.45 కు ముగిసిన సమీక్షా సమావేశంలో చూడాలి! అందుకు తగ్గట్లుగా 3 మార్లు ఉద్యమాశయాన్ని నినదించి, బ్రతుకుకు పనికొచ్చే సూక్తిని చెప్పినది నూతక్కి శివబాబు గారు!
రేపటి గ్రామ బాధ్యతలు సైతం RTC ప్రవేశ ద్వారం వద్దనే!
దేదీప్యం చేయవచ్చు!
వందలాది వలంటీర్ల సేవా చరితములున్నవి
మహిళలు వీధుల నూడ్చిన మంచి మంచి కథలున్నవి
నగల నమ్మి ఊరికే సమర్పించిన త్యాగముంది….
దేన్నైనా వ్రాయవచ్చు! దేదీప్యం చేయవచ్చు!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
25.11.2025