3666* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

స్వచ్ఛ సుందరోద్యమంలో ఒక తమాషా సంఖ్య – 3666* వ రోజు!

               తారీఖైతే 28-11-25. నానాటికీ విజ్రాంభిస్తున్న చలిని లెక్క పెట్టక రెండో - మూడో కిలోమీటర్లు ప్రయాణించి, 4.18-6.15 సమయంలో తమ ఊరి స్వచ్ఛ-శుభ్ర-సౌందర్య సౌభాగ్యం కోరుకొనే 26 మంది వీధి సేవలు పడమటి వీధిలో కొనసాగాయి!

               కార్యకర్తల దురదృష్టమో RTC బస్టాండు అదృష్టమో గాని, కోట గుమ్మం వద్ద ఆగిఅవనిగడ్డ దిశగా పని చేయాలనుకొన్న వాలంటీర్లు 10 వ రోజు కూడ RTC ఆవరణలో కొంత పని చేయవలసొచ్చింది.

               ప్రధానంగా శ్రమ జరిగిన చోటులు మాత్రం కోట గుమ్మం ఇరువైపులా, పడమటి వీధి ఇరు ప్రక్కలా. వాటిలో ఒక భాగమైతే స్థలం 3-4 సెంట్లే గాని-10 మందికి పని కల్పించింది. మూరెడెత్తు పెరిగిన గడ్డీ, పిచ్చి తీగలూ, వాటి మధ్య 2 డిప్పల సీసాలూ, మరో రెండు డిప్పల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లూ! అది ఎగుడుదిగుడు చోటై, రాళ్ళ మధ్య పని కావడంతోనే అంతటి శ్రమ!

               వచ్చేపోయే వాళ్లూ, ఆటో డ్రైవర్లూ, చిన్నకార్ల వారూ నేటి స్వచ్ఛ కారక్రమాన్ని కాలక్షేపంగానే చూశారు తప్ప – ఈ పాతిక మంది 100 గజాల వీధిలో – గుడి వద్దా, కట్టెల అడితీ దగ్గరా, దుకాణాల ఎదుటా మట్టిలో కూర్చొని, ఎంత సహనంతో శుభ్రపరుస్తున్నారో - విడి విడిగా పనిచేస్తున్నా ఎంతగా సమష్టి కార్యక్రమమో - గ్రామ సంక్షేమం పట్ల కార్యకర్తల దీక్ష ఏమిటో ఆలోచించారా?

               ఇళ్లొదలి చీకటిలో గృహిణులూ, 8-9 గంటలకే ఉద్యోగ విధులున్న వ్యక్తులూ, కాళ్ళు తడబడే వృద్ధులూ, విశ్రాంత ఉద్యోగులూ తమ గ్రామం పట్ల ఎందుకింత పట్టుదలగా 11-12 ఏళ్ల నుండి శ్రమిస్తున్నారో ఎవరికీ పట్టదు.

               రోజుటిలాగే పెద్ద ట్రాక్టరు నిండా చెత్తా, 2 గోతాల ప్లాస్టిక్ - గాజు వ్యర్ధాలూ ఈ పూటా దొరికాయి. నలుగురైదుగురు కదిలించవలసిన బరువైన యంత్రాన్ని రోడ్డు లోపలకు గురవయ్య – శివబాబుల జంట ఏ ఆవేశంతో జరిపారో అనిపించింది!

               కోట ప్రవేశద్వారం వద్ద జరిగిన తుది సమావేశంలో గుడ్డ బ్యానర్ పైన 3666 రోజుల సంఖ్యను చూసి కొందరు కార్యకర్తలు 6666 వ రోజు వరకూ ఇలా శ్రమదానం చేస్తే బాగుండునని ఉత్సాహపడ్డారు. (అందుకు 8 సంవత్సరాల 3 నెలలైనా ఆగాలి)

               రేపటి వీధి శ్రమదానం కోసం పడమటి వీధిలోనే మరికొంత ముందు కలవాలని నిర్ణయించారు!

               గొప్ప గ్రామం – స్వర్గ ధామం – 1

ఎచట పౌరులు బుద్ధిమంతులొ - ఎచట మానవ విలువలున్నవొ -

త్యాగమెక్కడ పురులు విప్పెనొ - శ్రమకు ఎక్కడ చోటుదక్కెనొ -

‘గ్రామ బాధ్యత తమది’ అనుకొను కార్యకర్తల నిలయమేదో....

అది కదా ఒక గొప్ప గ్రామం! అదేకద ఒక స్వర్గధామం!

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    28.11.2025